Land Dispute: ఇంటి తాళాలు పగలగొట్టి, నిర్మాణంలోకి చొరబడి స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు గండిమైసమ్మ డాక్టర్ బస్తీలో కలకలం రేపుతోంది. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు. రౌడీషీటర్ బృందం నకిలీ పత్రాలతో తన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలు వర్ష వాగ్మోరి తెలిపిన వివరాల ప్రకారం.. వివాదాస్పద స్థలానికి సంబంధించి గతంలోనే 59 జీవో కింద ప్రభుత్వానికి డీడీ చెల్లించారు. ఈ స్థలం ఆమెకు చెందినదేనని రెవెన్యూ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. అయినప్పటికీ, కొందరు నకిలీ పత్రాలను చూపిస్తూ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి, రౌడీ మూకలు లోపలికి చొరబడి ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించిన బాధితురాలు.. న్యాయం చేయాలని దుండిగల్ పోలీసులను కోరారు. స్థలంపై హక్కులకు సంబంధించి పోలీసులు రెవెన్యూ అధికారులను వివరాలు అడిగినట్లు తెలిసింది. 59 జీవో కింద చెల్లింపులు, స్థల యాజమాన్య పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు.
సదరు రౌడీషీటర్ గతంలో సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు భూవివాదాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తాజా ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.
Also read: కొబ్బరి నూనె, మసాలాలతో కేరళ స్టైల్ పీతల వేపుడు.. తయారీ విధానం ఇదిగో!