ZPTC Elections: టిడిపిలో డైనమిక్ లీడర్ గా పేరొందిన పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం అనూహ్యంగా జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దూకారు. కదిరి నియోజక వర్గం నల్ల చెరువు జెడ్పీటీసీ అభ్యర్ధిగా శ్రీరాం నామినేషన్ దాఖలు చేశారు. తండ్రి పరిటాల రవీంద్రతో పాటు తల్లి పరిటాల సునీత కూడా మంత్రులుగా వ్యవహరించారు. వారి రాజకీయ వారసుడిగా ఎమ్మెల్యే అవ్వాలనుకున్న శ్రీరాం 2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. మొదటి ఎన్నికల్లోనే ఓటమి చెందినా నిరాశలో కూరుకుపోకుండా జనంతో మమేకం అవుతూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు. ఇపుడు తాజాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్దం కావడంతో జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించిన శ్రీరాం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. అయితే ఆయన మనసులో పెద్ద ఆలోచనే ఉందంటున్నారు ఆయన వర్గీయులు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికే విజయావకశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోన్న శ్రీరాం జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయన జెడ్పీటీసీ అభ్యర్ధి అవతారం ఎత్తారు.
జెడ్పీటీసీ ఎన్నికల బరిలో గొడ్డేటి మాధవి
ఇక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో అత్యంత చిన్న వయసులో ఎంపీ అయిన గొడ్డేటి మాధవి సైతం తాజాగా జెడ్పీటీసీ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశమవుతోంది. 2019 ఎన్నికల్లో అరకు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన మాధవి రెండు లక్షల కు పైగా మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.2024 ఎన్నికల్లో మాధవికి టికెట్ దక్కలేదు. ఇపుడు హఠాత్తుగా ఆమె కొయ్యూరు జెడ్పీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీగా వ్యవహరించిన మాధవి కేవలం జెడ్పీటీసీకి పోటీ చేయడం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో జిల్లా పరిషత్ ఛైర్ పెర్సన్ పదవి తమకే దక్కుతుందని వైసీపీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే మాధవికి జెడ్పీ పీఠం కట్టబెడతామని నాయకత్వం భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ జిల్లాలో అరకు ఎంపీ పదవితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి ఉన్నారు. గిరిజన ఓటర్లలో వైసీపీకి పట్టు ఉంది కాబట్టి జెడ్పీ పీఠం తమదేనన్న ధీమాతో మాధవి ఉన్నారట.
జెడ్పీ ఛైర్మన్ పీఠమే లక్ష్యంగా పరిటాల శ్రీరాం
2019లో ఎంపీ అయిన మాధవి ఆ తర్వాత ఏ పదవీ లేకుండా ఉండిపోయారు. ఇపుడు జెడ్పీలో వైసీపీ పాగా వేస్తే జెడ్పీ ఛైర్ పెర్సన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక పరిటాల శ్రీరాం ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇపుడు అదృష్టం కలిసొస్తే జిల్లా పరిషత్ ఛైర్మనే అయిపోతారు. ఇద్దరూ కూడా 35ఏళ్ల లోపు యువతే కావడం విశేషం.
Also Read: యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..