Apple Foldable iPhone: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ (Apple Foldable iPhone) మార్కెట్ లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట లీకయ్యాయి. యాపిల్ ఫోల్డబుల్ డిజైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఫోల్డబుల్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లపై కూడా చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మ్యాక్ రూమర్స్ (MacRumors) అనే అమెరికన్ టెక్ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ మాదిరిగానే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ సైతం ఉండనుంది. ఐపాడ్ మినీ తరహాలోనే ఫోన్ కుడివైపు ఎగువ భాగంలో పవర్ బటన్, టచ్ ఐడీ (ఫింగర్ ప్రింట్ సెన్సార్), కెమెరా కంట్రోల్ బటన్లు ఉండనున్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా పంచ్ హోల్ డిజైన్ ను కలిగి ఉండనున్నట్లు సమాచారం.
మెుబైల్ ను ఫోల్డ్ చేసినప్పుడు కవర్ స్క్రీన్ సుమారు 5.3 నుంచి 5.5 అంగుళాలు ఉండొచ్చని మ్యాక్ రూమర్స్ కథనం పేర్కొంది. అన్ ఫోల్డ్ చేసినప్పుడు అది 7.5 నుంచి 7.8 అంగుళాల వరకూ ఉండొచ్చని అంచనా వేసింది. క్రీజ్ – ఫ్రీ డిస్ ప్లే టెక్నాలజీతో ఈ ఫోల్డబుల్ డిస్ ప్లే రూపొందనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఈ ఫోల్డబుల్ ఫోన్.. 5500mAh బ్యాటరీతో రావొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఐఫోన్లలో వచ్చిన బ్యాటరీలతో పోలిస్తే ఇదే అతిపెద్దది కానుండటం గమనార్హం.
Also Read: Noise ColorFit Series: రూ. 2,500 లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్ ఏది ? Pulse 4 Max లేదా Icon 4?
ఫోల్డబుల్ ఐఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియార్ కెమెరా సెటప్ ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. 48MP డ్యూయల్ కెమెరాలు, 18MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ రాబోతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐఫోన్ 18 ప్రో’ సిరీస్ కు సమానంగా 12GB ర్యామ్ కూడా ఉండనున్నట్లు పేర్కొంటున్నాయి. టైటానియం, అల్యూమినియం కలగలిసిన బాడీతో ఈ ఫోల్డబుల్ ఫోన్ నిర్మాణం చాలా దృఢంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటివరకూ శాంసంగ్, గూగుల్ పిక్సెల్, మోటొరొలా, షావోమి, వివో వంటి మెుబైల్ కంపెనీలే ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. యాపిల్ సైతం ఈ సెగ్మెంట్ లోకి అడుగుపెడితే ఆయా కంపెనీలకు గట్టి పోటీ తప్పదని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.