ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. కృత్రిమ మేథ. ప్రస్తుతం ప్రపంచాన్ని శాశిస్తోన్న టెక్నాలజీ ఇది. పని సులభం చేయడంతోపాటు, ఉద్యోగులకు, ఉద్యోగాలకు కూడా ఎసరు పెడుతోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసే కంపెనీల మధ్య పోటీ కూడా తారాస్థాయికి చేరుకుంది. ఒకరిని మించి ఒకరు లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రోగ్రామ్ లను వదులుతున్నారు. అయితే ఈ ఏఐ టెక్నాలజీ తెలిసిన నిపుణుల సంఖ్య ఇప్పుడు పరిమితంగా ఉంది. ఇప్పటికే ఈ రంగంలో అనుభవం సంపాదించినవారు, అన్ని మెళకువలు నేర్చుకున్నవారి సంఖ్య తక్కువ. ఆ తక్కువ మందికోసం ఎక్కువ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ కాస్తా చివరకు పోరాటంగా మారింది. ఆ పోరాటంలో చాట్ జీపీటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
చాట్ జీపీటీ షట్ డౌన్..
చాట్ జీపీటీ మాతృసంస్థ అయిన ఏపెన్ ఏఐ.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజులపాటు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంటే వారం రోజులపాటు చాట్ జీపీటీ నుంచి కొత్త అప్ డేట్స్ ఏవీ ఉండవనమాట. ఒకరకంగా ఇది సింపుల్ షట్ డౌన్ అనొచ్చు. పోటీ తీవ్రంగా ఉన్న ఇలాంటి సమయంలో చాట్ జీపీటీ సేవల్ని ఆపేస్తే పరిస్థితి ఏంటి..? వినియోగదారులంతా ప్రత్యర్థి సాఫ్ట్ వేర్ కి అలవాటు పడితే ఎలా..? ఈ అనుమానాలకు ఓపెన్ ఏఐ తావు ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి ఆ సంస్థకు వినియోగదారులకంటే తమ ఉద్యోగులే ఎక్కువ ఇంపార్టెంట్. ఉద్యోగుల్ని కోల్పోవడం ఇష్టం లేకే ఓపెన్ ఏఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
మెటాకు వలసలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చాట్ జీపీటీ. దీనికి పోటీగా గూగుల్, మెటా వంటి సంస్థలు తమ సాఫ్ట్ వేర్స్ ని కూడా అభివృద్ధి చేశాయి. కానీ చాట్ జీపీటీ ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపరచుకుంటూ దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతోంది. అయితే మెటా, గూగుల్ వంటి బడా సంస్థల్ని ఓపెన్ ఏఐ తట్టుకోలేకపోయింది. వారు ఓపెన్ ఏఐ ఉద్యోగుల్ని ముందుగా టార్గెట్ చేశారు. పెద్ద పెద్ద ప్యాకేజీలు ఆశ చూపించి వారిని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ మేథో వలసతో ఓపెన్ ఏఐ దిగాలు పడింది. దీంతో వారం రోజులపాటు తాత్కాలిక షట్ డౌన్ ని ప్రకటించింది.
ఏం జరుగుతుంది..?
ఇప్పటికే ఓపెన్ ఏఐ కంపెనీలో ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని, వారిలో ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని మెటా తనవైపు తిప్పుకుంటోంది. గూగుల్ ఉద్యోగుల్ని కూడా మెటా ఆకర్షిస్తోంది. ఈ పోటీని నివారించడానికి వారం రోజులపాటు షట్ డౌన్ అంటూ వ్యూహాత్మక అడుగు ముందుకు వేసింది ఓపెన్ ఏఐ. దీని ద్వారా అద్భుతాలు జరగకపోవచ్చు కానీ, ఉద్యోగం మానివేయాలనుకునేవారు ఒక వారం టైమ్ తీసుకుంటారు. ఆ గ్యాప్ లో ఓపెన్ ఏఐ వారిని బుజ్జగించే అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ ప్లాన్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్లను వాడేవారికి తరచుగా ఒక మెసేజ్ కనపడుతుంది. తమ ఉద్యోగులు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారని, ఎక్కువమంది ఆ సాఫ్ట్ వేర్ వాడుతున్నందున కాసేపు వేచి చూడాలని తరచూ మనకు స్క్రీన్ పై కనపడుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ లు నిరంతరం తమ వినియోగదారులకోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులపై ఒత్తిడి భారం పడుతోంది. ఇది రోజురోజుకీ పెరగడమే కానీ, తగ్గడం లేదు. అందుకే కంపెనీల మధ్య పోరు మొదలైంది. ఆ పోరుని తట్టుకోలేక చాట్ జీపీటీ షట్ డౌన్ అవుతోంది.