Maganti Gopinath: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన అన్యాయాలపై బాధితులు హైదరాబాద్‌లో మోతి నగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళల వేధింపులు, భూకబ్జా, నకిలీ పత్రాలు, అక్రమ కేసులు వంటి అంశాల్లో గోపినాథ్ తన రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ స్పందించకపోవడాన్ని బాధితులు తీవ్రంగా విమర్శించారు.
బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం, మొదటి భార్యకు డైవర్స్ ఇవ్వకుండానే ఆమెను రాజకీయ కార్యక్రమాల్లో కూర్చోబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని అన్నారు. అలాగే, ఒక అమెరికన్ సీనియర్ సిటిజన్ మహిళ చేసిన ఫిర్యాదును కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా, న్యాయం జరగలేదని బాధితులు చెబుతున్నారు. NRI కుటుంబానికి చెందిన విలువైన భూమిని గోపినాథ్ అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రభుత్వ భూసంబంధిత డాక్యుమెంట్లను నకిలీగా తయారు చేయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ప్రభుత్వ అధికారుల సంతకాలు, రబ్బర్ స్టాంపులు కూడా నకిలీగా వాడినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదులు చేసినా, పోలీసులు ‘మేనేజ్’ అయ్యారని, కేసులను బలహీనపరిచి న్యాయాన్ని మోసం చేశారని వారు పేర్కొన్నారు.
Read Also: Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం
2018 ఎన్నికల సమయంలో గోపినాథ్ చర్యలను ప్రశ్నించిన వృద్ధ బ్రాహ్మణ మహిళపై అక్రమ కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్టు చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ స్వయంగా “అరెస్టు చేసి తీసుకెళ్లండి” అని ఆదేశించారని బాధితులు పేర్కొన్నారు. గోపినాథ్ వేధింపులపై ఫిర్యాదు చేసిన మరో మహిళను అధికారులు నిర్లక్ష్యం చేశారని, గోపినాథ్‌ను కాపాడేందుకు అధికార దుర్వినియోగం జరిగిందని బాధితులు తెలిపారు. గోపినాథ్ కారణంగా ప్రాంతంలో అనేక మహిళలు కేసులు, బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొన్నారని బాధితులు చెప్పారు.
ఈ ఆరోపణలపై కేటీఆర్ ఎప్పుడూ స్పందించలేదని వారు పేర్కొన్నారు.
కేటీఆర్‌కు ఛాలెంజ్
స్థానిక వ్యక్తి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, గోపినాథ్ తన నాలుగు కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని, దీనిని ప్రశ్నించినందుకు తనపై పలు కేసులు పెట్టారని తెలిపారు. గోపినాథ్ మరణం సహజసిద్ధంగా జరగలేదని, అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని బాధితులు పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. సంబంధిత అన్ని ఎవిడెన్స్‌తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని బాధితుడు కిషోర్ కుమార్ ప్రకటించారు. కేటీఆర్ పాత్ర, ఆయన స్పందన లేకపోవడంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.