Suicide Incidents: బేసిగ్గా.. చావడానికి చాలా ధైర్యం కావాలంటారు! ఎంతో ధైర్యం ఉంటే గానీ.. ఆత్మహత్య లాంటి నిర్ణయం తీసుకోరని చెబుతారు. అయితే.. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వరుస ఆత్మహత్యలను చూస్తుంటే.. అవన్నీ తప్పనిపిస్తోంది. ధైర్యం కావాల్సింది చావడానికి కాదు.. బతకడానికి! ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నంత సులభంగా.. ఏది ఏమైనా సరే బతికి తీరాలనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ధైర్యంగా జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. పోనీ.. ప్రాణం తీసుకుంటే పరిష్కారం దొరుకుతుందా? చచ్చేంత ధైర్యం.. బతకడానికి ఎందుకు లేదు?
జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి!
ఎవరి జీవితం కూడా పూల పాన్పు కాదు. ఈ డైలాగ్‌ని.. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. ఎక్కడో ఓ చోట చదివే ఉంటాం. లైఫ్ అంటే.. ఎప్పుడూ సుఖంగా, అన్ని రోజులూ సంతోషంగా ఉండదని తెలుసు. కష్టాలు, సుఖాలు, సవాళ్లు, సమస్యలు.. అందరికీ ఉంటాయ్. ఇవన్నీ.. ఏదో ఒక ఫేజ్‌లో ఎదుర్కోక తప్పదు. అయినా సరే.. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా.. ఎదుర్కోవాలి. వాటన్నింటిని ధైర్యంగా దాటుకొని.. ముందుకు సాగాలి. కానీ.. ఈరోజులు అలా లేవు. కాలం మారేకొద్దీ.. పబ్లిక్ మరింత వీక్‌గా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే.. చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనువు చాలిస్తున్నారు. సమస్య వస్తే చాలు.. దాన్ని ఎదుర్కోలేక చచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద, యువత, ముసలి, ముతకా అనే తేడా లేదు. అందరిదీ అదే దారి. ఎంతో అందమైన జీవితాన్ని గెలవలేక.. అర్ధాంతరంగా చనిపోతున్నారు. అసలు.. ఓ చిన్న సమస్యని కూడా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఎలా ఉంటున్నారు? దేనినైనా తట్టుకోగలిగే, ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసం ఏమైపోయిందనే ప్రశ్నలే.. ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయ్.
సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవడంతో విశాఖలో యువకుడు ఆత్మహత్య
సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవడంతో.. తల్లిదండ్రులను మోసం చేశాననే మనస్తాపంతో విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొబ్బరితోట ఏరియాలో ఓ గదిని అద్దెకు తీసుకొని.. హీలియం గ్యాస్‌తో ముఖానికి కవర్ తగిలించుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎగ్జామ్‌లో ఫెయిలైనంత మాత్రాన.. చనిపోవాలా? ఇంకాస్త బాగా చదివితే.. మళ్లీ పాస్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఎంతకీ పాస్ కాకపోతే.. మరేదైనా ఉద్యోగం దొరుకుతుంది. అంతే గానీ.. పరీక్షలో ఫెయిలవగానే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకొస్తోంది? చదువులు మధ్యలోనే ఆపేసి.. వండర్స్ క్రియేట్ చేసిన వాళ్లు, ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్లు ఎంతమంది లేరు? పరీక్షలే జీవితాన్ని నిలబెట్టవని.. అదొక్కటే జీవితం కాదని ఎప్పుడు తెలుసుకుంటారు?
హైదరాబాద్‌లో రెండేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలతో.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది కీర్తిక అగర్వాల్. తనతో పాటు రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని కూడా తీసుకెళ్లిపోయింది. ఫ్యామిలీలో గొడవలున్నంత మాత్రాన, భర్తతో మనస్పర్థలు వచ్చినంత మాత్రాన.. చావే పరిష్కారమా? అంతగా ఇబ్బంది ఉంటే.. పెద్దవాళ్లను కూర్చోబెట్టి మాట్లాడటమో, కౌన్సిలింగ్ తీసుకోవడమో చేయాలి గానీ.. ఇలా ప్రాణాలు తీసుకోవడమేంటి? చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకొస్తోంది? అనేదే.. ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. తిరుపతిలో ఇంజనీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల చందు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో.. తొర్రేడు తిరుమల కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఎల్ల సత్యదేవకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో తండ్రి దించి వెళ్లిన కొన్ని గంటల్లోనే.. సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్‌లో ఉండనని, ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటానని మారాం చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే.. వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. కూర్చోబెట్టి నచ్చజెప్పాలి. ఒకసారి కాకపోయినా.. మరోసారి వింటారు. కానీ.. హాస్టల్లోనే ఉండమన్నారనే బాధతో ప్రాణాలు తీసుకోవడమేంటి?
చిత్తూరు జిల్లా సీతమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్
చిత్తూరు జిల్లాలో సీతమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. గత నెల 30వ తేదీన.. ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే ఓ విద్యార్థిని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీచర్ కొట్టారని.. తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చదువుకునే చోట ఇబ్బందులుంటే.. తల్లిదండ్రులకు చెప్పాలి, స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి గానీ.. ఇలా చనిపోవడం వల్ల సమస్య తీరుతుందా? సూసైడ్ అటెంప్ట్స్ వల్ల పరిష్కారం దొరుకుతుందా? విద్యార్థులు.. ఎందుకు ధైర్యంగా తమ సమస్యపై పోరాడలేకపోతున్నారు? మెదక్ జిల్లాలో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తాళలేక.. శ్రీశైలం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత వరకు అప్పు తీర్చినా.. లోన్ యాప్ ఏజెంట్లు భారీ పెనాల్టీ వేశారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఇంటికొచ్చి బెదిరించారు. అంతే.. మనస్తాపంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది.. చనిపోయేంత సమస్యా? ఏజెంట్లు వేధింపులకు గురిచేస్తున్నారని.. పోలీసులను ఆశ్రయిస్తే పరిష్కారం దొరికేది. కానీ.. కొంతైనా ఆలోచించకుండా.. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనువు చాలిస్తున్నారు.
విశాఖలో భార్యాభర్తల ఆత్మహత్యతో విషాదం..
విశాఖలో.. భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదకరంగా మారింది. చనిపోయిన మహిళ.. ఏడు నెలల గర్భంతో ఉంది. తమ కోసం కాకపోయినా.. కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా.. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? సమస్య ఏదైనా కానీ.. చావే పరిష్కారమని ఎందుకనుకుంటున్నారు? విశాఖలోని సమత డిగ్రీ కాలేజీలో విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కూడా కలకలం రేపింది. మహిళా లెక్చరర్లు లైంగికంగా వేధించారని.. చనిపోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి రికార్డులోనూ తప్పులు ఎత్తి చూపుతున్నారని.. మనస్తాపం చెందాల్సినంత అవసరముందా? కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే.. సమస్య తీరిపోయేది. ఒకవేళ.. అక్కడ కూడా పరిష్కారం దొరకకపోతే.. విద్యార్థి సంఘాల నాయకులను సంప్రదిస్తే.. విషయం కొలిక్కి వచ్చేది. ఇంత సింపుల్‌గా సాల్వ్ అయ్యే వాటికి కూడా.. ఆత్మహత్యే శరణ్యమని ఎందుకనుకుంటున్నారు? చావొక్కటే.. అన్నింటికీ పరిష్కారమనే ఆలోచనలు ఎందుకొస్తున్నాయ్? మారాల్సింది.. సమాజమా? మనుషుల ఆలోచన విధానమా? కాస్త.. సమయం తీసుకొని ఆలోచిస్తే.. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ.. ఆలోచించలేక, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ.. తమ జీవితాలను ముగిస్తున్నారు. కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు.
ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్లే.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి చీకటి వెనుక.. ఓ వెలుగు రేఖ దాగి ఉంటుంది. సమస్య ఎలాంటిదైనా.. పరిష్కారం ఓపిగ్గా ఆలోచించి వెతుక్కోవాల్సింది మనమే. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని.. జీవితాన్ని గెలవాల్సిందే! కానీ.. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆత్మహత్యల పరంపర చూస్తుంటే.. సమాజం ఎటు వైపు పోతుందోనన్న భయం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ.. చావే పరిష్కారమనే మూర్ఖపు ఆలోచనల నుంచి బయటకు రాకపోవడమే.. గుండెల్ని పిండేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆత్మహత్యల ఆందోళనల్ని మరింత పెంచుతోంది. మరి.. దీనికేంటి పరిష్కారం?
చాలా మందిలో సన్నగిల్లుతున్న ఆత్మవిశ్వాసం
కారణాలు ఏవైనా కావొచ్చు.. సమస్య ఎలాంటిదైనా ఉండొచ్చు.. కానీ.. తీరిగ్గా ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లమ్‌కి.. కచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ.. ఏదైనా సమస్య వస్తే.. దాన్ని తట్టుకునేంత ఆత్మవిశ్వాసం చాలా మందిలో సన్నగిల్లుతోంది. వరుస ఆత్మహత్యల్ని చూశాక.. అర్థమవుతున్నది ఇదే. మార్కులు తక్కువొచ్చాయని, ఎగ్జామ్‌లో ఫెయిలయ్యామని, ప్రేమలో విఫలమయ్యామని, ఆర్థికంగా నష్టపోయామని, సోషల్ మీడియాలో ట్రోల్స్, కుటుంబ కలహాలు, వేధింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేక కారణాలున్నాయ్. మరెన్నో అవమానకర ఘటనలుంటాయ్. అయితే.. ఇటీవలి కాలంలో చాలా చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం.. ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా.. నేటి తరం కష్టాలను తట్టుకోలేకపోతోంది. ఒడిదొడుకులను తట్టుకోలేకపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. జీవితంలో భాగంగా ఎదురయ్యే చిన్న ఫెయిల్యూర్‌కి కూడా.. జీవితమే అంతమైపోయినట్లు భావిస్తున్నారు. ప్రతి సమస్యకు.. ఇన్‌స్టంట్ రిలీఫ్ కావాలి. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా.. వెంటనే పరిష్కారం దొరికేయాలనుకుంటారు. సొల్యూషన్ కాస్త లేటైనా.. లైఫ్ ఎండింగ్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ.. తాము ఎందుకూ పనికిరామని నిరాశ చెందుతున్నారు. మిగతా వాళ్లలా.. తమ లైఫ్ ఎందుకు లేదని బాధపడుతుంటారే తప్ప.. వారి స్థాయికి ఎదగాలని అనుకోవడం లేదు. ఈ సోషల్ కంపారిజన్స్ కూడా.. సూసైడ్స్‌కి ఓ రీజన్‌గా కనిపిస్తోంది.
ఆత్మహత్యలకు మానసిక ఆరోగ్య సమస్యలే కారణం!
అనేక ఆత్మహత్యలకు మానసిక ఆరోగ్య సమస్యలే కారణమంటున్నారు. ముఖ్యంగా.. డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్ లాంటివే.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్లు చెబుతున్నారు. తమ సమస్యని ఎవరితోనైనా చెప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. తమ ఇబ్బంది.. ఇతరులకు తెలిస్తే ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఎదుటి వాళ్లేమనుకుంటారో, ఇంట్లో వాళ్లు ఏమంటారో.. ఎవరికైనా చెబితే.. వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని.. వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్నారు. ఇలా.. చాలా మంది తమ సమస్యలకు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా.. ఇతరులతో పంచుకోకుండా.. వాళ్లకు వాళ్లే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతోమందిపై.. వారు పెరిగిన కుటుంబ, సామాజిక వాతావరణం కూడా ప్రభావం చూపుతోంది. పిల్లల మార్కుల కోసం, ర్యాంకుల కోసం పేరెంట్స్ చేసే ప్రెజర్‌ని తట్టుకోలేని వాళ్లు చాలా మంది ఉంటున్నారు. వారు.. తమ తల్లిదండ్రుల ఆశల్ని అందుకోలేకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక.. కుటుంబంలో ఉండే వాతావరణం కూడా వారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. తమ సమస్యలు పంచుకునే వాతావరణం లేకపోవడం, ఒంటరితనం పెరగడం లాంటివి.. తనువు చాలించాలనే నిర్ణయాలకు దారి చూపుతున్నాయ్.
ఆత్మహత్య.. ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు!
అయితే.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ప్రాణం తీసుకుంటే పరిష్కారం దొరకదు. ఆత్మహత్య.. ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. పైగా.. అది ఎవరూ పరిష్కరించలేని మరో సమస్యని సృష్టిస్తుంది. తమనే నమ్ముకున్న వారి జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధ అక్కడితో అంతమవుతుంది. కానీ.. ఆ బాధ మొత్తం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వారసత్వంగా మిగులుతుంది. ఇది.. మిగతా వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. జీవితమనేది.. ఆ భగవంతుడు ఇచ్చిన బహుమతి. జీవితమనేది.. లైఫ్ జర్నీలో ఎదురయ్యే సంఘటనలతో అనుభవాలని నేర్చుకునేందుకు, అప్పుడప్పుడు వచ్చే సమస్యలను అధిగమించేందుకు.. ఓ చక్కని అవకాశం. ప్రతి సమస్య ఓ పాఠాన్ని నేర్పుతుంది. ఆత్మహత్య ఆలోచనలు కేవలం.. ఆ క్షణంలోనో, ఆ రోజులోనో, ఆ దశలోనో.. ఓ తాత్కాలిక నిరాశ నుంచి పుడతాయ్. దాని ఆధారంగా.. శాశ్వతంగా తనువు చాలించాలనే నిర్ణయం తీసుకోవడం.. కచ్చితంగా తెలివైన పని మాత్రం కాదు. చచ్చేంత ధైర్యం.. బతకడానికి ఎందుకు లేదనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తిలో అపారమైన ధైర్యం, కఠినమైన నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తిలో అపారమైన ధైర్యం, కఠినమైన నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. అదే ధైర్యాన్ని.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లని ఎదుర్కొనేందుకు, పోరాడేందుకు ఉపయోగిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయ్.
జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ముగింపు ఆత్మహత్య కాదు..
సమస్యలున్నోళ్లు ఎవరైనా ఆలోచించాల్సింది.. అత్మహత్యలు ఎలా చేసుకోవాలని కాదు. సమస్య నుంచి పారిపోవడం కాదు.. పోరాడటం నేర్చుకోవాలి. ఓటమే.. అంతం అనుకోవద్దు. అదొక పాఠంగా భావించాలి. మరణాన్ని ఆశ్రయించడం కంటే.. మళ్లీ ప్రయత్నిస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలే ఎక్కువ. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. వాటికి ముగింపు ఆత్మహత్య కాదు. అదొక.. కొత్త ప్రయాణానికి పునాది కావాలి. ఆత్మహత్య చేసుకునేకంటే ముందు.. మీ సమస్యని కుటుంబ సభ్యులతో చర్చించండి. కుదరకపోతే.. ఫ్రెండ్స్‌కి, మీ శ్రేయోభిలాషులకు చెప్పండి. పరిష్కారం మీకు తట్టకపోయినా.. మీ వాళ్లకు తెలియొచ్చు. వాళ్లకు.. దానిని సాల్వ్ చేసే సామర్థ్యం ఉండొచ్చు. ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేస్తే.. అందమైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఓటమి కూడా జీవితంలో భాగమని అర్థం చేసుకోవాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా.. తిరిగి ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. బతికేందుకు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ముళ్లను, రాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లాలి. లైఫ్ జర్నీలో వచ్చే ప్రతి మార్పును స్వాగతించినప్పుడే.. జీవితం సార్థకమవుతుంది.
Story By Anup, Bigtv