బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయకూడదని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజల్లో మార్పు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. చెత్తను చెత్త కుండీల్లోనే వేయాలని పదే పదే చెప్తోంది. ఇంకా జనాలు పద్దతి మార్చుకోవడం లేదు. అందులో భాగంగానే కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML), గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA)తో కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేసే వారి ఫోటోలను తీసి పంపించాలని కోరుతోంది. ఈ ఫోటోలు పంపిన వారికి రూ. 250 రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని అరికట్టడం, ప్రజల బాధ్యతను ప్రోత్సహించడం, బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నాటక సర్కారు ప్రకటించింది.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారి వివరాలను తమకు చెప్పాలంటూ BSWML అధికారులు వాట్సాప్ నెంబర్ (9448197197) అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా చెత్త వేసే వారి ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరారు. పంపించిన ఫోటోలు, వీడియోలను పరిశీలించిన తర్వాత BSWML అధికారులు చెత్త పారేసేవారిని గుర్తించి, రిపోర్ట్ చేసిన వారికి UPI ద్వారా నేరుగా రూ. 250 రివార్డ్ అందించనున్నారు. ఈ నిర్ణయంతో పౌరులు చెత్త పడేసేవారి వివరాలను పంపడం వల్ల.. సదరు వ్యక్తులు తమ తీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. చివరికి బెంగళూరు బహిరంగ ప్రదేశాల్లో చెత్త అనేది కనిపించదని అధికారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ నెంబర్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఫోటోలు, వీడియోలు పంపించేందుకు ఒక యాప్ ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!
తాజాగా తీసుకొచ్చి ఈ విధానం ద్వారా చెత్త బహిరంగ ప్రదేశాల్లో పడేసేవారికి భారీగా జరిమానాలు విధించనున్నట్లు BSWML అధికారులు తెలిపారు. తొలిసారి చెత్త బయటపడేసే వారికి రూ.2,000 జరిమానా విధించనున్నారు. మరోసారి ఇదే విధానం కొనసాగితే ఏకంగా రూ. 10,000 వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. రివార్డులు, జరిమానాలు కలిపి బెంగళూరును క్లీన్ సిటీగా మార్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ప్రజల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని BSWML ఈ నెల ప్రారంభంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, అధికారిక అమలు తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించింది. ఈ కార్యక్రమం ఇంకా సన్నాహక దశలోనే ఉందని వెల్లడించింది. ఈ విధానం బహిరంగ ప్రదేశాలలో డంపింగ్‌ను తగ్గించడమే కాకుండా, సమాజ బాధ్యతను కూడా పెంపొందిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?