Hair Thinning: జుట్టు పలచబడటం అనేది ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు లేదా జన్యుపరమైన కారణాల వల్ల జరుగుతుంది. సరైన నూనెలను ఉపయోగించి క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా తిరిగి ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించే హెయిర్ ఆయిల్స్:
1. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో ముఖ్యంగా లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఈ లారిక్ యాసిడ్ చాలా చిన్న అణువులను కలిగి ఉండడం వల్ల జుట్టు షాఫ్ట్‌లో లోతుగా చొచ్చుకుపోతుంది.
ప్రయోజనం: ఇది జుట్టు లోపల ఉండే ప్రొటీన్‌ను నష్టం కాకుండా కాపాడుతుంది. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, పగిలిపోకుండా రాలడం తగ్గుతుంది. కొబ్బరి నూనె తల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, చుండ్రును కూడా తగ్గిస్తుంది.
2. ఆముదం నూనె : ఆముదం నూనెలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనం: ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ నూనె రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. దీని చిక్కటి స్వభావం కారణంగా జుట్టు రాలిన ప్రదేశాలలో తిరిగి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
3. బాదం నూనె: బాదం నూనెలో విటమిన్ E, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
ప్రయోజనం: విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది తల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదం నూనె తేలికగా ఉండి, జుట్టుకు లోతుగా తేమను అందించి, చివర్లు చిట్లిపోకుండా నివారిస్తుంది. ఇది జుట్టుకు మెరుపునిచ్చి, పలచబడటాన్ని అరికడుతుంది.
4. టీ ట్రీ నూనె: టీ ట్రీ నూనెలో శక్తివంతమైన యాంటీమైక్రోబయల్, శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి.
ప్రయోజనం: జుట్టు పలచబడటానికి ప్రధాన కారణాలలో ఒకటి అపరిశుభ్రమైన తల చర్మం. ఈ నూనె తల చర్మంపై పేరుకుపోయిన ఫంగస్ లేదా బ్యాక్టీరియాను తొలగించి, రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
Also Read: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?
5. ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో ఒలీక్ ఆమ్లం , పామిటిక్ ఆమ్లం , స్క్వాలీన్ వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
ప్రయోజనం: ఈ నూనె డీహైడ్రేషన్ కారణంగా జుట్టు పలచబడకుండా నివారిస్తుంది. ఇది జుట్టుకు బలాన్ని ఇచ్చి, మృదువుగా ఉంచుతుంది. ఆలివ్ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టును దెబ్బతినకుండా రక్షిస్తాయి. అంతే కాకుండా కుదుళ్లను దృఢంగా చేస్తాయి.
ఈ నూనెలలో దేనినైనా గోరువెచ్చగా చేసి, తల చర్మానికి సున్నితంగా మసాజ్ చేసి, కనీసం 30 నిమిషాలు లేదా రాత్రంతా ఉంచి, ఆపై షాంపూతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా వారానికి కనీసం రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం ఉత్తమం.