BLDC Fan Repair: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బిఎల్డిసి (BLDC) ఫ్యాన్ల గురించే చర్చ జరుగుతోంది. కరెంట్ బిల్లు సగానికి పైగా తగ్గిస్తాయని అందరూ వీటిని ఎగబడి కొంటున్నారు. అయితే..పాత కాలపు ఫ్యాన్లతో పోలిస్తే.. వీటిలో ఉండే అసలు తిప్పలు రిపేర్ల దగ్గరే వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లోని BLDC ఫ్యాన్ సర్క్యూట్ లేదా మదర్‌బోర్డ్ పాడైతే ఎంత ఖర్చవుతుంది? లోకల్ ఎలక్ట్రీషియన్లు దీనిని బాగు చేయగలరా? వారంటీ ముగిశాక వచ్చే ప్రాక్టికల్ ఇబ్బందులు ఏంటి? అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజుల్లో స్మార్ట్ హోమ్స్ వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక BLDC ఫ్యాన్ అయినా కనిపిస్తోంది. పాతకాలపు ఫ్యాన్లు 75 వాట్ల కరెంట్ వాడితే.. ఇవి కేవలం 28 నుంచి 35 వాట్లతోనే నడుస్తాయి. ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ.. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పాత ఫ్యాన్లలో కేవలం కాయిన్ చుట్టడం లేదా రూ. 50 పెట్టి కెపాసిటర్ మారిస్తే ఫ్యాన్ మళ్ళీ కొత్తదానిలా తిరిగేది. కానీ BLDC ఫ్యాన్ల లోపల కథ పూర్తిగా వేరుగా ఉంటుంది.
మదర్‌బోర్డ్ కాలిపోవడానికి కారణాలు:
ఈ బిఎల్డిసి ఫ్యాన్లు పూర్తిగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్ లేదా మదర్‌బోర్డ్ ఆధారంగా పనిచేస్తాయి. రిమోట్ కంట్రోల్, స్పీడ్ రెగ్యులేషన్ అంతా ఈ చిన్న బోర్డులోనే అమర్చబడి ఉంటుంది. మన దేశంలో సాధారణంగా ఉండే వోల్టేజ్ మారినప్పుడు అయినప్పుడు లేదా ఇంట్లోకి హై-వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ మదర్‌బోర్డ్ చాలా ఈజీగా కాలిపోతుంది. ఎలక్ట్రానిక్ వస్తువు కావడంతో దీనికి సెన్సిటివిటీ ఎక్కువ.
సర్క్యూట్ పాడైతే అయ్యే.. అసలు ఖర్చు ఎంత?
ఒకవేళ మీ BLDC ఫ్యాన్ మదర్‌బోర్డ్ పాడైతే ఎంత ఖర్చవుతుందనేది మీరు వాడుతున్న బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యాన్ కొన్న మొదటి 2 నుంచి 3 ఏళ్ల వరకు కంపెనీలు ఉచితంగానే వారంటీ కింద సర్క్యూట్ మార్చి ఇస్తాయి కాబట్టి అప్పటివరకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాని వారంటీ పీరియడ్ అయిపోయాక ఈ బోర్డు పాడైతే మాత్రం కాస్త ఎక్కువగానే ఖర్చవుతుంది. మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్ల (ఆటమ్‌బర్గ్, క్రాంప్టన్, హావెల్స్, ఓరియంట్ వంటివి) ఒరిజినల్ మదర్‌బోర్డ్ ధర సుమారు రూ.800 నుండి రూ.1,500 వరకు పలుకుతోంది.
దీనికి తోడు కంపెనీ టెక్నీషియన్ విజిటింగ్ ఛార్జీలు మరో రూ.300 నుంచి రూ. 400 అదనంగా వసూలు చేస్తారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఒక్కసారి సర్క్యూట్ మారడానికి రూ.1,200 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతుంది. దాదాపు కొత్త ఫ్యాన్ ధరలో ఇది సగం ఖర్చుతో సమానం.
లోకల్ మెకానిక్స్ బాగు చేయగలరా?
ఇక్కడ ఇంకొక ప్రాక్టికల్ సమస్య ఏంటంటే.. ఈ మదర్‌బోర్డులు సాధారణ ఎలక్ట్రానిక్ దుకాణాల్లో అంత సింపుల్ గా దొరకవు. మీ వీధి చివర ఉండే లోకల్ మెకానిక్ బాబు దగ్గరకు ఈ ఫ్యాన్ తీసుకెళ్తే.. అతను చేతులెత్తేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఇందులో ఉండే మైక్రోకంట్రోలర్లు, మాస్‌ఫెట్లు బాగు చేయడం నార్మల్ ఎలక్ట్రీషియన్ల వల్ల కాదు. ఖచ్చితంగా కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ నుంచే కొత్త బోర్డు తెప్పించుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఈఫ్యాన్లతో క్షణాల్లోనే.. ఇల్లంతా కూల్ కూల్!
ఒకవేళ మీరు ఉండేది చిన్న టౌన్ లేదా పల్లెటూరు అయితే.. ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అందుబాటులో లేకపోతే.. పార్ట్స్ రావడానికి వారాల టైమ్ పడుతుంది. కొన్ని లోకల్ బ్రాండ్లకైతే వారంటీ తర్వాత అసలు విడిభాగాలే దొరకవు. అప్పుడు ఫ్యాన్ స్క్రాప్ కింద పడేయాల్సిందే.
కొనేముందు గమనించాల్సిన జాగ్రత్తలు:
కొందరు ఆన్‌లైన్‌లో రూ. 400 లకే దొరికే యూనివర్సల్ BLDC డ్రైవర్ బోర్డులను తెచ్చి లోకల్ మెకానిక్స్‌తో వేయిస్తున్నారు.అయితే ఇవి ఎక్కువ రోజులు పని చేయవు. పైగా రిమోట్ ఫీచర్లు సరిగ్గా పనిచేయవు. కాబట్టి.. కరెంట్ ఆదా అవుతుందని బ్లైండ్‌గా ఫ్యాన్ కొనేసే ముందు.. మీ ఏరియాలో ఆ బ్రాండ్‌కు పక్కాగా సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఇంటికి మెయిన్ లైన్ దగ్గరే మంచి వోల్టేజ్ ప్రొటెక్టర్ లేదా స్పర్జ్ ప్రొటెక్టర్ వాడటం వల్ల ఈ కాస్ట్‌లీ మదర్‌బోర్డులు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. స్మార్ట్ టెక్నాలజీతో లాభాలు ఎంత ఉన్నాయో, ఇలాంటి హిడెన్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అంతే ఉంటాయని మైండ్‌లో పెట్టుకుంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Also Read: ఏసీ కొనలేకపోతున్నారా? సింగిల్ రూమ్ కోసం బెస్ట్ కూలర్లు..