ACB Raids: స్వేచ్చ బ్యూరో: అయిదు.. ఆరంకెల్లో జీతాలు. ఏసీ కార్లు.. కార్యాలయాలు. కడుపులో చల్ల కదలకుండా బతికే అవకాశం. అయినా కొందరు ప్రభుత్వ అధికారులు అవినీతి జలగల్లా మారుతున్నారు. అవకాశం ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా లంచం. చేసిన పనికి బిల్లు చెల్లించమని అడిగినా లంచం. చివరకు పెన్షన్ ఫైల్ ను ముందుకు కదిలించండి మహాప్రభో అని మొర పెట్టుకున్నా లంచం. ఇలా ప్రతీ పనికి రేటుకట్టి మరీ డబ్బు గుంజుతున్నారు. ఫలితంగా ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్తం అవినీతిమయం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆమ్యామ్యాలకు చెక్ పెట్టటానికి చాలా సేవలను ఆన్ లైన్ లోకి తీసుకొచ్చినా ప్రైవేట్ వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని మరీ అక్రమార్కులు నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. దీనికి సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఏ, మీ సేవా కేంద్రాలు.. ఇలా చెబుతూ పోతే అవినీతికి అడ్డాగా మారిన ప్రభుత్వ కార్యాలయాల జాబితా చాంతాడంత ఉంది.
వంశీ మోహన్..మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (యూఎల్సీ)గా డ్యూటీ. ఇంకేముంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు పోగేసుకున్నాడు. ఫిర్యాదులు రావటంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు వంశీ మోహన్ అక్రమాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వంశీ మోహన్ ఇంటితోపాటు అతని బంధుమిత్రుల ఇళ్లల్లో సోదాలు చేశారు. దీంట్లో వంశీ మోహన్ వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా వెల్లడైంది.
రెడ్ హిల్స్ లోని జలమండలం కార్యాలయంలో సగ్గం అనంతలక్ష్మి కుమార్ (58) ప్రాజెక్ట్ డివిజన్ 8 జనరల్ మేనేజర్. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన కూతురి పెళ్లి చేయటం అధికారవర్గాల్లో చర్చనీయమైంది. ఆనోటా ఈనోటా సమాచారం తెలిసి ఏసీబీ అధికారులు ఇటీవల మల్లాపూర్ లోని అనంతలక్ష్మి కుమార్ నివాసంతోపాటు ఎనిమిది చోట్ల దాడులు జరిపి తనిఖీలు చేశారు. సోదాల్లో అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో1.10 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 2.1కిలోల బంగారు నగలు, 9.2 కిలోల వెండి సామాగ్రి దొరికింది. పలు ఆస్తుల డాక్యుమెంట్లు లభించాయి. వీటి విలువ మార్కెట్లో వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీలుగా పని చేసిన అధికారుల ఇళ్లపై దాడులు జరిపినపుడు కూడా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఇలా ఏ కాస్త పెద్దస్థాయి అధికారి ఇంట్లో తనిఖీలు జరిపినా వందల కోట్లలోనే ఆస్తులు బయడ పడుతుండటం ఆయా శాఖల్లో పేరుకుపోయిన అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇక, లంచాలు తీసుకుంటూ దొరికిన వారి జాబితా గురించి చెబితే చాంతాడంత అవుతుంది.
Also Read: గెలుస్తామని ధీమాతో ఉన్నోళ్లు.. ఇంత దిగజారుడు రాజకీయలను ఎందుకు ఎంచుకున్నట్టు..!?
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు గడిచిన పదిహేడు నెలలుగా జోరు పెంచారు. 2025లో అత్యధికంగా 199 కేసులు నమోదు చేసి 273మంది అధికారులను కటకటాల వెనక్కి పంపించారు. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో 50కి పైగా కేసులు రిజిష్టర్ చేశారంటేనే ఏసీబీ దూకుడు అర్థమవుతోంది.
అవినీతికి చెక్ పెట్టటానికి ఏసీబీ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి అంటూ హెల్ప్ లైన్ నెంబర్ తో ఉన్న సైన్ బోర్డులను అందరికీ కనిపించేలా పెడుతున్నారు. కంప్లయింట్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగి లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. అదే సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న అధికారుల భరతం కూడా పడుతున్నారు.
ఏసీబీలో పని చేస్తున్న వారిలో 73మంది అధికారులకు గత ఏడాది ఉన్నతాధికారులు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆయా కేసుల్లో అరెస్టయిన నిందితుల ప్రొఫైళ్ల తయారీ, అనుమానాస్పద అధికారుల వివరాలు ఎలా సేకరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. దాంతోపాటు అవినీతికి మరిగిన అధికారులపై నిఘా ఎలా పెట్టాలి? బినామీ ఆస్తులను ఎలా గుర్తించాలి? ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ ఫుట్ ప్రింట్లను ఎలా సేకరించాలి? అన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా అవినీతి అధికారుల ఆట కట్టించటంలో ఏసీబీ సత్ఫలితాలు సాధిస్తోంది.
ప్రజలు సహకారం అందించినపుడే పూర్తి స్థాయిలో అవినీతి అధికారుల ఆట కట్టించటం సాధ్యమవుతుందని ఏసీబీ డీజీపీ చారు సిన్హా తెలిపారు. దీని కోసం యాంటీ కరప్షన్ వీక్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశామన్నారు. దీంట్లో అవినీతి అధికారులకు సంబంధించి సమాచారాన్ని అందించాల్సిన ప్రాధాన్యత, ఎలా కంప్లయింట్ చేయాలన్న దానిపై విస్తృతమైన అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఎవరు లంచం డిమాండ్ చేసినా 1064 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. దాంతోపాటు కంప్లయింట్లు ఇవ్వటానికి క్యూ ఆర్ కోడ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. 9440446106 నెంబర్ కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఎంతటి స్థాయి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Also Read: వివాదానికి తెరలేపిన బీజేపీ కల్లాల యాత్ర.. అసలు చిట్టా మర్చిపోయారా..!