Air Conditioner Tips: ఈసారి వేసవికి ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో చాలామంది ఇళ్లల్లో ఎయిర్ కండీషర్‌లను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వేడి గాలులలకు, విపరీతమైన ఉక్కపోతకు ఏసీ ఇచ్చే ఉపశమనం అంతా ఇంతా కాదు. అయితే, ఎంత మంచి బ్రాండ్ ఏసీ అయినా సరే, ఒక్కోసారి సమస్యలు ఇవ్వడం సహజం. ముఖ్యంగా వేసవి కాలం మధ్యలో ఏసీ ఆగిపోతే వచ్చే ఇబ్బంది వర్ణనాతీతం. సరైన నిర్వహణ ఉంటే ఏసీలు చాలా కాలం మన్నుతాయి. అందుకే ఏసీల్లో తరచూ వచ్చే కొన్ని ముఖ్యమైన సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిది.
ఏ యంత్రానికైనా క్రమబద్ధమైన క్లీనింగ్ చాలా అవసరం. ఏసీలోని ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటిలో దుమ్ము పేరుకుపోయి గాలి ప్రసరణ ఆగిపోతుంది. దీనివల్ల గది చల్లబడటానికి మిషన్ చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. చాలామంది ఏసీ ఫిల్టర్లు లోపల ఉండటం వల్ల వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ముఖ్యంగా ఏసీ ఎక్కువగా వాడే రోజుల్లో నెలకు ఒకసారైనా ఫిల్టర్లను తీసి క్లీన్ చేసుకోవడం చాలా మంచిది.
ఫిల్టర్లు బాగున్నా కూడా ఒక్కోసారి ఏసీ సరిగ్గా గాలిని బయటకు పంపలేదు. ఏసీ డక్ట్ సిస్టమ్‌లో ఏవైనా లీకేజీలు ఉన్నా లేదా లోపల గ్యాస్ (రెఫ్రిజెరెంట్) తగ్గిపోయినా మిషన్ రీడింగ్స్ మారిపోతాయి. దీనివల్ల ఏసీ కాయిల్స్ హీట్ ఎక్కి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గది తలుపులు ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల కూడా గాలి ఒకేచోట ఉండిపోయి.. ఇల్లంతా సమానంగా చల్లబడదు. కాబట్టి గదిలో గాలి స్వేచ్ఛగా తిరిగేలా చూసుకోవాలి.
Also Read: షాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!
ఫ్రిడ్జ్ తలుపు తీసి పెడితే లోపలి వస్తువులు చల్లబడవు కదా, ఏసీ విషయంలోనూ అంతే. ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు పూర్తిగా మూసి ఉంచాలి. అయితే కిటికీల సందుల నుండి లేదా తలుపుల కింద నుండి చిన్నగా బయటి వేడి గాలి లోపలికి వస్తున్నా ఏసీ పనితీరు తగ్గిపోతుంది. విండో ఏసీలు వాడేవారు పక్కన ఉండే ప్యానెల్స్ దగ్గర వెదర్ స్ట్రిప్పింగ్ లేదా అదనపు ఇన్సులేషన్ వాడటం మంచిది. దీనివల్ల గది త్వరగా చల్లబడుతుంది, కరెంట్ కూడా ఆదా అవుతుంది.
గదిలోని ఉష్ణోగ్రతను కనిపెట్టే థర్మోస్టాట్‌ను ఎప్పుడూ ఎండ తగిలే చోట గానీ, వేడి ఎక్కువగా ఉండే కిచెన్ లేదా ఇతర పరికరాల పక్కన గానీ పెట్టకూడదు. దీనివల్ల అది గది అసలు ఉష్ణోగ్రతను తప్పుగా అంచనా వేస్తుంది. దీనివల్ల ఏసీ అవసరం లేకపోయినా ఎక్కువ సేపు నడవడం లేదా తరచూ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే రోజులో ఏసీని మాటిమాటికీ ఆన్, ఆఫ్ చేయడం వల్ల కూడా కంప్రెషర్‌పై భారం పడి త్వరగా పాడైపోతుంది.
ఇటీవల చాలామంది చిన్న పోర్టబుల్ ఏసీలను వాడుతున్నారు. వీటిని గదిలో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనికి ఉండే పైపులు వంకరలు లేకుండా నేరుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ ఏసీలను గోడకు మరీ దగ్గరగా పెట్టకుండా గాలి తిరగడానికి తగినంత స్థలం ఇవ్వాలి. ముఖ్యంగా నేల సమానంగా ఉన్న చోటే వీటిని ఉంచాలి, లేదంటే నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సరైన స్థానంలో పెట్టినప్పుడే ఇవి తక్కువ ఖర్చుతో మంచి కూలింగ్‌ను అందిస్తాయి.
Also Read: ఇక ఏసీ గాలి నేరుగా ఒంటికి తగలదు..: శాంసంగ్ తెచ్చిన ఈ సరికొత్త AI ఏసీ చూశారా?