E-Paper
Advertisement

Zojila Tunnel: 3 గంటల ప్రయాణం ఇక 20 నిమిషాల్లోనే.. చైనా, పాక్‌లకు మైండ్ బ్లాంక్!

Zojila Tunnel: 3 గంటల ప్రయాణం ఇక 20 నిమిషాల్లోనే.. చైనా, పాక్‌లకు మైండ్ బ్లాంక్!

Zojila Tunnel: సముద్ర మట్టానికి 11 వేల 578 అడుగుల ఎత్తులో.. 13 కిలోమీటర్లకు పైగా పొడవుతో.. హిమాలయ పర్వతశ్రేణుల్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులని ఎదుర్కొంటూ నిర్మించిందే.. ఈ జోజిలా టన్నెల్. లద్దాఖ్ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో.. 365 రోజులు అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన, వ్యూహాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. భౌగోళికంగా, సైనికపరంగా.. ఈ సొరంగం భారత్‌కు ఓ గేమ్ ఛేంజర్ లాంటిది. ఆసియాలోనే అత్యంత పొడవైన టూ వే టన్నెల్‌లో ఇది రికార్డు సృష్టించింది. అంతేకాదు.. భారత రక్షణ రంగానికి జోజిలా టన్నెల్ రక్షణ కవచం లాంటిది. చైనా, పాకిస్తాన్‌‌తో సరిహద్దులు పంచుకునే లద్దాఖ్ ప్రాంతంలో.. ఈ సొరంగం భారత్‌కు వ్యూహాత్మక పైచేయిని ఇస్తుంది.

లద్దాఖ్‌కు కొత్త లైఫ్‌లైన్

జమ్ముకశ్మీర్-లద్దాఖ్‌ని లింక్ చేసే జోజిలా టన్నెల్ నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 13 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించనున్నారు. హిమాలయ పర్వత శ్రేణులను తొలిచి ఈ అద్భుత నిర్మాణాన్ని సృష్టించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సింగిల్‌ ట్యూబ్‌ బై డైరెక్షనల్‌ టన్నెల్‌గా ఇది గుర్తింపు పొందింది. దాదాపు 5 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. సొరంగ మార్గాన్ని రెండు వైపులా ప్రారంభిస్తున్నప్పటికీ.. అంతర్గత రహదారులు, ప్లాస్టరింగ్ లాంటి తుది నిర్మాణ పనులకు ఇంకొన్ని నెలల సమయం పట్టనుంది.

హిమాలయాల్లో ఇంజినీరింగ్ అద్భుతం

చలికాలంలో హిమాలయాల్లో కురిసే భారీ మంచు వల్ల జోజిలా పాస్ మూతపడేది. దాంతో.. లద్ధాఖ్ ప్రాంతం దేశంతో దాదాపు 7 నెలల పాటు పూర్తిగా డిస్‌కనెక్ట్ అయిపోయేది. టన్నెల్‌ నిర్మించిన చోట ఏడాదిలో వంద రోజుల పాటు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయ్. అత్యంత ప్రతికూల వాతావరణం, ఆకస్మిక తుఫానులు ఇక్కడ సర్వ సాధారణం. ఈ టన్నెల్ వల్ల శీతాకాలంతో సంబంధం లేకుండా, ఏ సమయంలోనైనా భారత సైన్యం, భారీ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించవచ్చు. ప్రాజెక్ట్ నిర్మాణం 2020లో మొదలవగా.. తొలి దశ పనులు 2025 మార్చి నాటికి విజయవంతంగా పూర్తయ్యాయ్.

సైనిక రవాణాకు కొత్త బలం

ఈ ప్రాజెక్టుతో ఇకపై శ్రీనగర్-లద్దాక్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రమాదకరమైన మంచుకొండల్లో ప్రయాణించడానికి పట్టే సమయం కూడా తగ్గిపోనుంది. సోనమార్గ్‌ సమీపంలోని బాల్తాల్‌ వెస్ట్ పోర్టల్‌ నుంచి ద్రాస్‌-కార్గిల్‌ ప్రాంతంలోని మీనమార్గ్‌ ఈస్ట్ పోర్టల్‌ వరకు జోజిలా టన్నెల్‌ విస్తరించి ఉంది. ఈ టన్నెల్‌ నిర్మాణంతో కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్‌ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. దేశ భద్రతతో పాటు టూరిజం విస్తరణకు కూడా ఈ టన్నెల్ కీలకం కానుంది. దీనివల్ల.. స్థానిక వ్యాపారాలు వృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయ్.

సవాళ్లను జయించిన జోజిలా టన్నెల్

గడిచిన ఐదేళ్లలో పనులకు ఆటంకం కలిగిస్తూ.. ఐదు భారీ తుఫాన్లు సంభవించినా దాదాపు 1200 మంది శ్రామికులు వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. ప్రధాన టన్నెల్ మార్గాన్ని తొలిచే క్రమంలో.. రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. ఈ సవాళ్లన్నింటిని.. ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది అద్భుతమైన నైపుణ్యంతో అధిగమించారు. రోడ్లు, బ్రిడ్జ్‌లతో కలిపి.. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు దాదాపు 31 కిలోమీటర్లు. ఇంత పెద్ద టన్నెల్ మార్గంలో గాలి ప్రసరణకు, అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగపడేలా.. అత్యాధునిక టెక్నాలజీతో కొండపై నుంచి కిందకు మూడు వర్కిటల్ షాప్ట్‌లను నిర్మించారు.

4 గంటల ప్రయాణం 20 నిమిషాలకు

చలికాలం మొదలవకముందే.. లద్దాఖ్‌లో ఉన్న సైనికులకు ఏడాదికి సరిపడా రేషన్, ఇంధనం, మందులను ముందే స్టాక్ చేయాల్సి వచ్చేది. ఇందుకోసం.. ఎయిర్‌ఫోర్స్ విమానాలపై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు రోడ్డు మార్గంలో.. నేషనల్ హైవే వన్‌‌పై ప్రయాణాన్ని ఈ టన్నెల్ పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం జోజిలా పాస్ దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్‌లు ఉంటే రోజంతా పట్టేది. టన్నెల్ అందుబాటులోకి వస్తే.. జర్నీ టైమ్ 20 నిమిషాలకు తగ్గనుంది. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత.. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కార్గిల్, లేహ్, సియాచిన్ లాంటి సున్నితమైన ప్రాంతాలకు.. సైన్యాన్ని, లాజిస్టిక్ట్స్‌ని నిరంతరం పంపడానికి ఈ టన్నెల్ లైఫ్ లైన్ కానుంది.

Also Read: స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

Related News

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

నోర్త్ గోవా Vs సౌత్ గోవా.. మీ నెక్స్ట్ ట్రిప్‌కి ఏది బెస్ట్? ఈ ఒక్క క్లారిటీ ఉంటే చాలు!

అచ్చం అద్దం లాగే.. ఇండియాలోని ఈ సరస్సులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ!

అరుణాచలం ట్రిప్.. భక్తులకు తప్పిన తిప్పలు, చర్లపల్లి నుంచి నేరుగా రైళ్లు

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC బెటరా? RailOne బెటరా?

తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

Big Stories

×