Electric Flame Stove: ఈ ఏఐ యుగంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో వింతలు, విడ్డూరాలు మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కొన్నిసార్లు ఏది నిజమో, ఏది ఫేక్ వార్తనో.. ఏది ఏఐ సృష్టించిన మాయాజాలమో అర్థం కాక బుర్ర గీక్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య వంటింటి గ్యాడ్జెట్లకు సంబంధించి వచ్చే వీడియోలు చూస్తుంటే.. ‘అరే.. ఇలాంటిది కూడా ఉంటుందా? అని మనకు తెలియకుండానే నోరెళ్లబెడుతుంటాం.
అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఒక స్టవ్‌ను చూపిస్తూ.. దానికి గ్యాస్ కనెక్షన్ లేకపోయినా, కేవలం గాలి ద్వారానే మంట వస్తున్నట్టు చూపించారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇది నిజంగానే ఉందా? లేక ఇదంతా గ్రాఫిక్స్ మహిమా? అనే చర్చ మొదలైంది ఇప్పుడు.
ఆ వీడియోలో ఏం చూపించారంటే.. ఒక చిన్న పెట్టెలాంటి స్టవ్ ఉంది. దానికి ఎలాంటి సిలిండర్లు లేవు, పోనీ గ్యాస్ పైపులు ఉన్నాయా అంటే అవీ లేవు. కేవలం ఒక చిన్న ఎయిర్ బ్లోయర్ లాంటి మిషన్ పెట్టి, దాని ద్వారా వచ్చే గాలితో మంటను కంట్రోల్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు కొన్ని మనం చూశాం. నీటితో మంట పుట్టించడం, చిన్న చిన్న కర్ర పుల్లలతోనే పెద్ద స్టవ్ వెలిగించడం లాంటివి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ లేటెస్ట్ స్టవ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ మాత్రం వేరే ఉంది.
Also Read: బెస్ట్ ఇండక్షన్ అంటే ఏయే ఫీచర్లు ఉండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? పూర్తి వివరాలివే!
మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఇంటర్నెట్‌లో కనిపించేవన్నీ నిజం కావు. ఈ వీడియోల్లో చూపించేవి నిజానికి ‘బయోమాస్ స్టవ్స్’ (Biomass Stoves) అనే రకానికి చెందినవి. వీటిని అసలు గ్యాస్ లేకుండా నడపడం అనేది ప్రస్తుతానికి సాధ్యం కాని పని. కాకపోతే, ఈ వీడియోలు తీసేటప్పుడు తెలివిగా గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉందో కెమెరాకు కనిపించకుండా జాగ్రత్త పడతారు.
మరికొందరైతే కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం డిజిటల్ ఎఫెక్ట్స్ వాడి మనల్ని నమ్మిస్తారు. ఆ మధ్య వైరల్ అయిన వీడియోలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. చూసే మనకు అది ఏదో మ్యాజిక్ లాగా అనిపించినా, దాని వెనుక మాత్రం గ్యాస్ కనెక్షన్ కచ్చితంగా ఉండి తీరుతుంది. అది లేకుండా మంట రావడం ఇంపాజిబుల్.
ఇలాంటి వీడియోలు చూసి చాలామంది తొందరపడి మోసపోతుంటారు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఇలాంటి స్టవ్స్ దొరుకుతున్నాయని నమ్మి వెంటనే ఆర్డర్ చేసేస్తుంటారు. తీరా అది ఇంటికి వచ్చాక చూస్తే.. అది మనం వాడుకునే మామూలు స్టవ్ లాగే ఉంటుంది తప్ప, వీడియోలో చూపించిన విన్యాసాలేవీ చేయదు. ఇంటర్నెట్‌లో ఏదైనా విషయం వైరల్ అవుతుందంటే, దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఆలోచించాలి.
ప్రయోగాలు చేయడం వేరు, అది నిజ జీవితంలో సాధ్యపడటం వేరు. అందుకే ఇలాంటి ఫేక్ వీడియోలు చూసి ఆశపడి మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోవద్దని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి తిక్క వింతలు మనల్ని పక్కదారి పట్టించడం కామన్ అయిపోయింది.. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
Also Read: ఇండక్షన్ స్టవ్ వాడుతూ కరెంటు బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు.. అదెలాగో తెలుసా?
?utm_source=ig_web_button_share_sheet