టెక్నాలజీ పరంగా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(AI) రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. యూజర్లు ఇచ్చే ఇన్ పుట్స్ ఆధారంగా వారు కోరుకునే ఫోటో లేదంటే వివరాలను అందిస్తుంది. అందులో భాగంగానే ఎలన్ మస్క్.. తన గ్రోక్ కు ఇన్ పుట్స్ ఇవ్వగా.. ఆయన కోరుకునే రూపం గణేష్ అని చెప్పింది. అంతేకాదు, విఘ్ననాయకుడి గురించి కీలక విషయాలను వెల్లడించింది. తాజాగా ఆయన తనకు, గ్రోక్ కు మధ్య జరిగిన సంభాషణను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. మస్క్ హిందూ దేవుడి గురించి పోస్ట్ చేయడం పట్ల చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మస్క్.. గ్రోక్ కు సాంప్రదాయ భారతీయ ఇత్తడి విగ్రహానికి సంబంధించిన ఫోటోను అందించాడు. దానిని గుర్తించాలని కోరాడు. వెంటనే గ్రోక్ దానిని లార్డ్ గణేశుడిగా గుర్తించింది. “ఇది గణేశుడిని సూచించే చిన్న ఇత్తడి లేదంటే కాంస్య విగ్రహం” అని చెప్పింది. అదే సమయంలో విగ్రహానికి సంబంధించిన లక్షణాలను హైలైట్ చేసింది. దానికి ఏనుగు తల, నాలుగు చేతులు, కూర్చున్న భంగిమ, పాదాల దగ్గర ఉన్న ఎలుక గురించి చెప్పింది. అదే సమయంలో గణేశుడు శుభం, జ్ఞానం, శ్రేయస్సును అందిస్తాడని చెప్పింది. “గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు. శుభం కలిగించే వాడు. జ్ఞానం, శ్రేయస్సును అందించే దేవుడు. ఇటువంటి విగ్రహాలను సాధారణంగా రోజువారీ పూజ కోసం ఇంట్లోని పూజ గదులలో ఉంచుతారు. ఇది సాంప్రదాయ దక్షిణ భారత శైలి ఇత్తడి విగ్రహంగా కనిపిస్తుంది. బహుశా ఈ విగ్రహం ఎరుపు వర్ణపు చెక్క పీఠంపై ఉంచబడుతుంది” అని గ్రోక్ చెప్పుకొచ్చింది.
— Elon Musk (@elonmusk) November 11, 2025
ఎలోన్ మస్క్ హిందూ దేవుడి గురించి పోస్ట్ చేయడం పట్ల చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. “గణేశుడిని పూజించండి, టెస్లాకు సంబంధించి కొత్త ఆవిష్కరణలలో విఘ్నాలు తొలగిపోతాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అడ్డంకులను తొలగించేవాడు. జ్ఞానానికి చిహ్నం అయిన గణేశుడిని ఏఐ ఎంతో అద్భుతంగా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. పురాతన జ్ఞానం ఆధునిక AIని కలిపి చూడటం చాలా సంతోషంగా ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “గ్రోక్ మంచి టాలెంట్ కలిగి ఉంది. భారతీయ దేవుళ్ల గురించి కూడా చక్కగా వివరిస్తుంది. మీలాంటి టెక్ దిగ్గజాల నుంచి ఇలాంటి పోస్టు రావడం చాలా సంతోషంగా ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “భారతదేశం, భారత ప్రజల ఆరాధ్య దైవాల గురించి యావత్ ప్రపంచం ఆలోచిస్తుందని చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా సోషల్ మీడియా అంతా ప్రస్తుతం మస్క్, గ్రోక్, గణపతి చుట్టూనే తిరుగుతోంది.
Read Also: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?