E-commerce Sales Drop: పండగ సీజన్ అనగానే ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో బిజినెస్ పీక్స్‌లో ఉంటుంది. నెలలు ముందు నుంచే కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతుంటారు. కానీ.. ప్రస్తుతం పండగ అమ్మకాల సీజన్లో మార్కెట్ నుంచి వస్తున్న వార్తలు టెక్కీలను, వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఊహించినదానికి భిన్నంగా స్మార్ట్ ఫోన్లు , ల్యాప్‌టాప్‌ల డిమాండ్ అకస్మాత్తుగా పడి పోయింది. ఖరీదైన గాడ్జెట్లకు కస్టమర్లు దూరంగా ఉండటంతో ఈ-కామర్స్ సేల్స్ సుమారు 10 శాతం మేర తగ్గాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి రాగానే దాన్ని కొనడానికి జనాలు ఎగబడేవారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా కస్టమర్లు చాలా ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. అత్యవసర ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తూ, ఖరీదైన స్మార్ట్ ఫోన్లు , హై-ఎండ్ ల్యాప్‌టాప్‌ల కొనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. “ఉన్న ఫోనే బాగానే పని చేస్తోంది కదా, మళ్లీ ఎందుకు అనవసరంగా వేల రూపాయలు ఖర్చు పెట్టడం” అనే ధోరణి మధ్యతరగతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు, ప్రీమియం ల్యాప్‌టాప్‌ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ స్మార్ట్ ఫోన్ల ధరలు సైతం రూ.30,000 నుంచి రూ.50,000 దాటుతుండగా.. ఐఫోన్లు, శాంసంగ్ అల్ట్రా సిరీస్ ఫోన్ల ధరలైతే లక్ష రూపాయలకు పైనే ఉంటున్నాయి. ఈ భారీ ధరల కారణంగా సామాన్య, మిడిల్ క్లాస్ ప్రజలు ఈ ప్రీమియం గాడ్జెట్లకు దూరంగా ఉంటున్నారు.
నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగి పోవడంతో సామాన్యుల జేబులపై తీవ్రమైన భారం పడుతోంది. చేతిలో .. ఉన్న డబ్బును భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలనే.. ఆలోచన పెరిగింది తప్ప, లగ్జరీ గాడ్జెట్ల మీద ఖర్చు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ ఆర్థిక సమస్యలు నేరుగా ఈ-కామర్స్ సేల్స్ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణమైంది.
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన స్మార్ట్ ఫోన్లు ఒకటి లేదా రెండు సంవత్సరాలకే హ్యాంగ్ అవ్వడం లేదా స్లో అవ్వడం జరిగేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో.. లభిస్తున్న మిడ్-రేంజ్ ఫోన్లు కూడా చాలా పవర్ ఫుల్‌గా వస్తున్నాయి. మంచి ప్రాసెసర్లు, బెస్ట్ కెమెరాలు ఉండటం వల్ల జనాలు ఒకసా రి కొన్న ఫోన్‌ను కనీసం 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుతున్నారు. దీని వల్ల పదే పదే కొత్త ఫోన్లు మార్చే వారి సంఖ్య బాగా తగ్గింది.
Also Read: లేటెస్ట్ అప్డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!
ఖరీదైన లక్ష రూపాయల ఫోన్లకు బదులుగా,కస్టమర్లు ఇప్పుడు రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు లభించే బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో.. మంచి ఫీచర్లు ఇస్తుండటంతో జనాలు కాస్ట్లీ ఫోన్లను పక్కనపెట్టి బడ్జెట్ మోడల్స్‌నే కొంటున్నారు. ఈ ట్రెండ్ కూడా పెద్ద బ్రాండ్ల సేల్స్ పడి పోవడానికి ఒక కారణం అయింది.
ప్రస్తుత పండగ సీజన్లో డిమాండ్ తగ్గినా.. రాబోయే రోజుల్లో కంపెనీలు కొత్త ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా,కస్టమర్లు ఇప్పుడు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ అనవసర ఖర్చులకు.. దూరంగా ఉంటున్నారనేది ఈ పండగ సేల్స్ ద్వారా స్పష్టమవుతోంది.