Fake QR Codes: ఈ రోజుల్లో టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా QR కోడ్లే కనిపిస్తున్నాయి. ఒక్క స్కాన్‌తో క్షణాల్లో చెల్లింపులు చేయొచ్చు. అయితే, ఇదే సౌకర్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ QR కోడ్లతో మోసాలకు పాల్పడుతున్నారు. తెలియకుండానే ప్రమాదంలో పడకుండా ఉండాలంటే, QR కోడ్‌ను స్కాన్ చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా గమనించాలి. అసలు నకిలీ QR కోడ్లను ఎలా గుర్తించాలి? స్కాన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
సాధారణంగా దుకాణాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో బోర్డులపై ఉండే QR కోడ్లను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. వారు అసలైన కోడ్ పైన తమ సొంత నకిలీ QR కోడ్ స్టిక్కర్‌ను అతికిస్తారు. కాబట్టి మీరు స్కాన్ చేసే ముందు ఆ QR కోడ్ బోర్డుపై ముద్రించి ఉందో లేక పైన వేరే స్టిక్కర్ ఏమైనా అతికించి ఉందో ఒకసారి చేతితో తాకి చూడటం చాలా మంచిది.
Also Read: గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?
అధికారికంగా ఏర్పాటు చేసే QR కోడ్లు ఎప్పుడూ చాలా స్పష్టంగా, నాణ్యమైన ప్రింటింగ్‌తో ఉంటాయి. అలా కాకుండా కోడ్ మసకగా ఉన్నా, రంగులు మారిపోయినా లేదా కటింగ్ సరిగ్గా లేకపోయినా దాన్ని స్కాన్ చేయకపోవడమే శ్రేయస్కరం. నేరగాళ్లు హడావుడిగా తయారుచేసి ప్రింట్ తీసిన కోడ్లలో ఇలాంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.
చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. కెమెరా ముందు QR కోడ్ పెట్టగానే వచ్చిన లింక్‌ను చూడకుండానే ఓపెన్ చేయడం. మీరు స్కాన్ చేయగానే మీ ఫోన్ స్క్రీన్‌పై ఒక వెబ్సైట్ అడ్రస్ లేదా యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఆ అడ్రస్‌లో అక్షర దోషాలు ఉన్నాయో లేదో గమనించాలి. అలాగే ప్రముఖ బ్యాంకులు లేదా సంస్థల పేర్లను కాస్త అటుఇటుగా మార్చి పెట్టే లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
బస్ స్టాండ్లు, పార్కులు, రైల్వే స్టేషన్లు లేదా రోడ్డు పక్కన గోడలపై కనిపించే ఉచిత ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో ఉండే QR కోడ్ల జోలికి వెళ్లకపోవడమే క్షేమం. ఇటువంటి ప్రదేశాల్లో ఉండే కోడ్ల ద్వారా మీ ఫోన్లోకి ప్రమాదకరమైన వైరస్లు వచ్చే అవకాశం ఉంది. కాస్త అప్రమత్తంగా ఉంటే డిజిటల్ మోసాల నుండి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు.
Also Read: యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?