iPhone Scam| చాలామంది ఆన్‌లైన్ డీల్స్, డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా ఐఫోన్లు కొంటారు. కొన్ని ఆఫర్లలో ఫోన్ స్థితి గురించి ముఖ్య వివరాలు దాచిపెడతారు. ఐఫోన్ ధర ఎక్కువ కాబట్టి కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అయితే కొత్త ఐఫోన్ ఆర్డర్ చేస్తే పాత ఐఫోన్ డెలివరీ అయింది. అందుకే మీకు కొనుగోలు చేసిన ఫోన్ నిజంగా కొత్తదేనా అని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆపిల్ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం సూచించింది. ఐఫోన్ మోడల్ నంబర్ చూసి అది కొత్తదా? పాతదా? అని గుర్తించవచ్చు. ఈ పద్ధతి అన్ని ఐఫోన్ మోడల్స్‌కు వర్తిస్తుంది.
ఆన్ లైన్‌లో కొందరు సెల్లర్లు రిఫర్బిష్డ్ ఫోన్ల (సెకండ్ హ్యాండ్)ను కొత్తవిగా చూపిస్తారు. మరికొందరు రీప్లేస్‌మెంట్ యూనిట్లను స్పష్టంగా చెప్పకుండా విక్రయిస్తారు. ఫోన్ స్థితి తెలుసుకోవడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ ఐఫోన్ కొత్తదా లేక ముందు సర్వీస్ చేయబడిందా అని తెలుస్తుంది. డెమో, పర్సనలైజ్డ్ డివైస్‌లను కూడా గుర్తించవచ్చు.
ముందుగా ఐఫోన్‌లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. జనరల్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ఇప్పుడు అబౌట్ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మోడల్ నంబర్ కనిపిస్తుంది. మొదట్లో ఈ నంబర్ గందరగోళంగా అనిపించవచ్చు. కానీ దాని మొదటి అక్షరం చాలా ముఖ్యం. ఇదే మీ ఫోన్ కండిషన్ గురించి తెలుపుతుంది.
మోడల్ నంబర్ M అక్షరంతో మొదలైతే ఆ ఫోన్ బ్రాండ్ న్యూ అంటే కొత్తదని అర్థం. ఆపిల్ దీన్ని కొత్తగానే విక్రయిస్తుంది. ఈ ఫోన్ ఎప్పుడూ సర్వీస్ సెంటర్‌కు వెళ్లలేదు. ముందు రిపేర్ లేదా రీప్లేస్ కాలేదు. చాలా రిటైల్ ఐఫోన్లు M కోడ్‌తోనే ఉంటాయి. కొత్త ఫోన్ కొనేవారు ఈ కోడ్ తప్పకుండా పరిశీలించి తీసుకోవాలి.
మోడల్ నంబర్ Fతో మొదలైతే ఆ ఫోన్ రిఫర్బిష్డ్ అంటే సెకండ్ హ్యాండ్. ఇంతకుముందు ఎవరైనా కొనుగోలు చేసి ఏదైనా సమస్య వల్ల రిటర్న్ చేసి ఉండొచ్చు లేదా విక్రయించేసి ఉండొచ్చు. ఆపిల్ దీన్ని రిపేర్ చేసి, బాగా టెస్ట్ చేసి మళ్లీ విక్రయిస్తుంది. రిఫర్బిష్డ్ ఫోన్లు సరిగ్గా పనిచేస్తాయి కానీ బ్రాండ్ న్యూ కావు. ఇవి సాధారణంగా కొత్త మోడల్స్ కంటే చవక ధరలకు లభిస్తాయి.
మోడల్ నంబర్ Nతో మొదలైతే ఆ ఫోన్ రీప్లేస్‌మెంట్ యూనిట్. సర్వీస్ రిక్వెస్ట్ తర్వాత ఆపిల్ ఇచ్చిన ఫోన్ ఇది. రీప్లేస్‌మెంట్ యూనిట్లను కొత్తవిగా అమ్మరు. చాలాసార్లు రిఫర్బిష్డ్ యూనిట్లనే రీప్లేస్‌మెంట్‌గా ఇస్తారు. ఇవి క్వాలిటీ స్టాండర్డ్స్ పాటిస్తాయి కానీ ఉపయోగించినవి కావు.
మోడల్ నంబర్ Pతో మొదలైతే ఆ ఫోన్ పర్సనలైజ్డ్. కొనుగోలు సమయంలో ఆపిల్ కస్టమైజ్ చేసింది. ఎంగ్రేవింగ్ లేదా స్పెషల్ డిజైన్ ఆప్షన్లు ఉంటాయి. ఇవి నిర్దిష్ట కొనుగోలుదారుల కోసం తయారవుతాయి. పర్సనలైజ్డ్ ఫోన్లు అసలు, ఒరిజినల్‌గానే ఉంటాయి. కస్టమైజేషన్ పనితీరు లేదా క్వాలిటీని ప్రభావితం చేయదు.
మోడల్ నంబర్ 3Aతో మొదలైతే ఆ ఫోన్ డెమో యూనిట్ అని అర్థం. ఆపిల్ స్టోర్లలో డిస్‌ప్లే కోసం ఉపయోగించిన ఫోన్లు ఇవి. రిటైల్ స్టోర్లలో యాక్టివ్‌గా ఉంచుతారు. తర్వాత డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తారు. డెమో ఫోన్లు బ్రాండ్ న్యూ రిటైల్ యూనిట్లు కావు. కొద్దిగా ఉపయోగించేసి నట్లు గుర్తులు కనిపించవచ్చు.
Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ
ఐఫోన్ కొనుగోలు చేసిన తర్వాత తప్పక మోడల్ నంబర్ చెక్ చేయండి. ఇది చేయడానికి కొన్ని సెకన్లు పడుతుంది. ఇలా చేయడం వల్ల మోసపోకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. సెల్లర్ మాటలు గుడ్డిగా నమ్మొద్దు. ఆపిల్ మోడల్ నంబర్ సిస్టమ్ కచ్చితంగా పనిచేస్తుంది.
ఐఫోన్ కొనడం పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. దాని కండిషన్ తెలుసుకోవడం వల్ల నిజమైన విలువ లభిస్తుంది. మోడల్ నంబర్ అంతా స్పష్టంగా చెబుతుంది. ఈ ట్రిక్ అందరు ఐఫోన్ యూజర్లకు పనిచేస్తుంది. ఏ ఐఫోన్ అయినా కొనుగోలు చేసే ముందు ఈ నెంబర్లు తప్పక వెరిఫై చేయండి.