Refrigerator Tips: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ తప్పనిసరిగా మారిపోయింది. కూరగాయాలను తాజాగా ఉంచడానికి, మిగిలిన ఆహారాన్ని భద్రంగా దాచుకోవడానికి ఫ్రిడ్జ్ లపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. అయితే నిరంతరం పనిచేస్తూ ఉండటం వల్ల.. ఫ్రిడ్జ్ వల్ల విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోందని పలువురు వాపోతున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో ఈ విద్యుత్ భారం భరించలేని విధంగా ఉంటోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్ ను 24 గంటలపాటు రన్నింగ్ లో ఉంచుతూనే పవర్ బిల్లును తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిడ్జ్ ను ఎప్పుడూ గోడకు అతుక్కుపోయినట్లు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వెనుక వైపు కనీసం అర అడుగు దూరం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఎండ తగిలే చోట, స్టవ్ లేదా ఓవెన్ పక్కన ఫ్రిజ్‌ను ఉంచకూడదని సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఫ్రిడ్జ్ వేడెక్కి, కూలింగ్ కోసం ఎక్కువ కరెంట్ లాగుతుందని వివరిస్తున్నారు.
కొందరు వండిన వంటకాలను నేరుగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. వేడి వస్తువులను లోపల పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ లోపలి టెంపరేచర్ సైతం పెరుగుతుంది. దాన్ని మళ్లీ కూల్ చేయడానికి కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వస్తువులు పూర్తిగా చల్లారాకే లోపల పెట్టడం బెస్ట్.
ఫ్రిడ్జ్ తలుపుకున్న రబ్బర్ (గ్యాస్కెట్) లూజ్ అయితే లోపలి చల్లదనం బయటకు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక పేపర్‌ను డోర్ మధ్యలో పెట్టి లాగి చూడండి. అది సులువుగా వచ్చేస్తే రబ్బర్ పాడైందని అర్థం. వెంటనే దాన్ని మార్చడం వల్ల చాలా కరెంట్ ఆదా అవుతుంది.
ఫ్రిడ్జ్ లో గాలి ఆడటానికి తగినంత స్థలం తప్పక ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వస్తువులను ఇరుకైనట్లుగా కుక్కేస్తే చల్లటి గాలి లోపల తిరగక కంప్రెసర్‌పై భారం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. అలాగని మరీ ఖాళీగా ఉంచినా కరెంట్ ఎక్కువే ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. వాటర్ బాటిళ్లను పెట్డడం ద్వారా.. ఫ్రిడ్జ్ లో మీడియం స్టోరేజ్ ను మెయిన్ టైన్ చేయెుచ్చని సూచిస్తున్నారు.
Also Read: కదిలే ఏసీ vs ఎయిర్ కూలర్.. సామాన్యులకు ఏది బెస్ట్.. సూటిగా సుత్తిలేకుండా!
కొందరు అవసరం ఉన్నా, లేకున్నా ప్రతీ చిన్నదానికి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంటారు. దీని వల్ల ఫ్రిడ్జ్ కూలింగ్ బయటకు పోయి.. బయటి వేడి లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ మళ్లీ కూల్ అవ్వడానికి ఎక్కువ విద్యుత్ ఖర్చు చేస్తుంది. కాబట్టి ఏం కావాలో ముందే అనుకుని ఒకేసారి ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మెుత్తంగా ఈ చిట్కాలు పాటించడం ద్వారా.. విద్యుత్ బిల్లును భారీగా ఆదా చేసే అవకాశం ఉంటుందని, తద్వారా డబ్బు జేబు నుంచి వెళ్లకుండా కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Also Read: విమాన ప్రయాణికులకు షాక్.. జూన్ 1 నుంచి భారీగా తగ్గనున్న.. Air India, Indigo సర్వీసులు!