టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, టెక్ మహీంద్రా, మైండ్‌ట్రీ.. దేశంలోని ఈ ఆరు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో గణాంకాల ప్రకారం.. 2025 అక్టోబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు ఈ కంపెనీల్లో సుమారు 92 వేల మంది ఉద్యోగులు బయటకు వెళ్లారు. ఇదే సమయంలో కొత్తగా చేరిన వారి సంఖ్య సుమారు 68 వేలు మాత్రమే. అంటే వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానంలో అందరినీ తిరిగి నియమించుకోవడం లేదు. దీంతో ఈ ఆరు కంపెనీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2025 అక్టోబర్‌లో 8 లక్షల 22 వేల 144 ఉండగా.. 2026 అక్టోబర్ నాటికి 7 లక్షల 97 వేల 722కు పడిపోయింది.
సంప్రదాయ ఐటీ ఉద్యోగాల్లో కొన్ని పనులను ఇప్పుడు ఏఐ వేగంగా పూర్తి చేస్తోంది. ముఖ్యంగా అప్లికేషన్ మెయింటెనెన్స్, మాన్యువల్ టెస్టింగ్, సాంకేతిక సహాయం వంటి విభాగాల్లో సాధారణ పనులకు అవసరమైన సిబ్బంది సంఖ్య తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ఏఐ ఒక్కటే కారణం కాదని.. వ్యాపార వృద్ధి మందగించడం, కొత్త ప్రాజెక్టులు తగ్గడం, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేయడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయని వివరిస్తున్నారు.
‘‘అన్నీ ఏఐ చేసేస్తోంది కదా.. ఇక మీరేందుకు?’’ అనే ప్రశ్న చాలామందికి ఎదురవుతుంది. దీనికి సరైన సమాధానం ఇవ్వాలంటే.. ఐటీ నైపుణ్యం ఒక్కటే సరిపోదు. ఏఐకి అనుబంధమైన కోర్సుల్లో కూడా నైపుణ్యం సంపాదిస్తే.. మీ ఉద్యోగం తప్పకుండా సేఫ్.
సంప్రదాయ ఉద్యోగాల్లో నియామకాలు తగ్గుతున్నప్పటికీ.. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఏడాదికి సుమారు 16 శాతం పెరుగుతున్నాయని టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించింది. పాత తరహా ఉద్యోగాలు చేస్తున్నవారికి కొత్త టెక్నాలజీలపై అవసరమైన నైపుణ్యాలు లేకపోతే.. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఏఐ ఆధారిత టూల్స్, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం కీలకంగా మారుతోంది.
మరోవైపు 2026 సెప్టెంబర్ క్వార్టర్స్ లో టీసీఎస్ 4,258 మందిని, హెచ్‌సీఎల్‌టెక్ 6,450 మందిని, టెక్ మహీంద్రా 5,446 మందిని కొత్తగా చేర్చుకున్నాయి. విప్రో మాత్రం ఇదే కాలంలో 6,716 మంది ఉద్యోగులను తగ్గించింది. దీంతో ఐటీ రంగంలో అన్ని కంపెనీల పరిస్థితి ఒకేలా లేదని స్పష్టమవుతోంది.
Also Read: గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!