Laptop Health: ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పని అయినా, క్లాస్ రూమ్ చదువులైనా చాలామంది ల్యాప్ టాప్ ను ఉపయోగిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఒడిలో (Lap) పెట్టుకొని గంటల తరబడి దానిపై వర్క్ చేస్తున్నారు. పేరులోనే ‘ల్యాప్’ ఉంది కదా అని అలా వాడుతుంటే మాత్రం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడటం వల్ల కలిగే 6 ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల గురించి ఈ కథనంలో చూద్దాం.
ల్యాప్ టాప్ పై పనిచేసేటప్పుడు దాని నుంచి వెలువడే వేడి (Heat) పురుషులలో వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది శృంగార సామర్థ్యాన్ని ముఖ్యంగా వీర్యకణాల ఉత్పత్తిని, వాటి నాణ్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పురుషులే కాకుండా మహిళల్లోనూ ఇది అండాల విడుదలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
ల్యాప్‌టాప్ నుంచి నిరంతరం వెలువడే వేడి చర్మానికి తగలడం వల్ల ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్’ (Toasted Skin Syndrome) అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒడి భాగంలో చర్మం రంగు మారిపోవడం, దురద పెట్టడం, మచ్చలు పడటం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలం పాటు ఈ వేడి చర్మానికి తగలితే కొన్నిసార్లు చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకున్నప్పుడు స్క్రీన్‌ను చూడటానికి సహజంగానే ముందుకు వంగాల్సి వస్తుంది. దీనివల్ల శరీర భంగిమ (Posture) దెబ్బతింటుంది. గంటల తరబడి ఇలా వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది కాలక్రమేణా తీవ్రమైన వెన్నునొప్పి, మెడనొప్పి (Cervical Pain), స్పాండిలైటిస్ వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గర్భిణీ స్త్రీలు ల్యాప్‌టాప్‌ను పొట్టకు దగ్గరగా లేదా ఒడిలో పెట్టుకుని అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే రేడియేషన్, వేడి.. కడుపులోని శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. ఇది పుట్టుకతో వచ్చే లోపాలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
Also Read: దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!
రాత్రిపూట ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల దాని స్క్రీన్ నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ (Blue Light) నేరుగా కళ్లపై పడుతుంది. ఇది శరీరంలో నిద్రను ప్రేరేపించే ‘మెలటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా సరైన నిద్ర పట్టకపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
Also Read: ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?