itel Tough Rugged Feature Phone: పంట పొలాల్లో పనిచేసే రైతులకు, ఎండనకా వాననకా కష్టపడే భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్‌ఫోన్లు వాడటం ఒక్కోసారి పెద్ద సాహసమే అవుతుంది. కింద పడితే పగిలిపోతాయనే భయం, దుమ్ము, ధూళి చేరి రిపేర్ వస్తుందనే టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే ఐటెల్ కంపెనీ తాజాగా మార్కెట్లోకి ఓ సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకువచ్చింది. అదే itel Tough. కఠినమైన వాతావరణంలో పనిచేసే వాళ్ల కోసమే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ itel Tough ఫోన్ ధర కేవలం రూ.1,499 మాత్రమే. సాధారణ బడ్జెట్‌లో లభించే ఈ ఫోన్.. బ్లాక్, డీప్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా లోకల్ రిటైల్ షాపుల్లో ఇది నేరుగా దొరుకుతుంది. అంతేకాకుండా కంపెనీ ఈ ఫోన్‌పై ఒక ఏడాది పాటు కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా ఇస్తోంది. అంటే.. ఫోన్‌కు ఏదైనా సమస్య వస్తే కొత్తది మార్చి ఇస్తారన్నమాట.
Also Read: iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!
itel Tough చూడటానికి చిన్నదే అయినా ఫీచర్లు మాత్రం అదుర్స్. ఇది రెండు మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఏమీ కాదు. దీనికి తోడు కంపెనీ ఒక ఫ్రీ డస్ట్ అండ్ షాక్‌ప్రూఫ్ సిలికాన్ కవర్‌ను కూడా ఇస్తోంది. ఇందులో ఉన్న 2000mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజులు వస్తుంది. రోజంతా బయట తిరిగే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అలాగే రాత్రి వేళల్లో ఉపయోగపడేందుకు డ్యూయల్ ల్యాంప్ టార్చ్‌ను కూడా ఇచ్చారు.
దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ప్రత్యేకంగా ఒక అగ్రి బటన్ ఉంది. దీన్ని ఒక్కసారి నొక్కితే నేరుగా ప్రభుత్వ హెల్ప్‌లైన్‌లకు కనెక్ట్ కావచ్చు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇంగ్లీష్, హిందీ భాషలలో మెనూ చదివి వినిపించే కింగ్ వాయిస్ ఫీచర్ కూడా ఉంది. శబ్దం ఎక్కువగా ఉండే బయటి ప్రదేశాలలో స్పష్టంగా వినపడేలా సూపర్ సౌండ్‌బాక్స్ స్పీకర్ ఇచ్చారు.
itel Toughలో 2.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. SC6531E చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్‌లో 4MB ర్యామ్ ఇచ్చారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో స్టోరేజీని 32GB వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, డ్యూయల్ సిమ్ సపోర్ట్, టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఇది తెలుగుతో సహా పది భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి తక్కువ ధరలో గట్టి ఫోన్ కోరుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్.
Also Read: యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?