అటూ ఇటూ పోయి మళ్లీ కేసీఆర్ చావు దగ్గరకు వచ్చి ఆగింది తెలంగాణ రాజకీయం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్‌ను తిట్టిన తిట్టు చిచ్చు అటు తిరిగి ఇటు తిరిగి.. వచ్చి కేసీఆర్ ఫామ్‌హౌజ్ గేటు దగ్గరికి వచ్చి ఆగింది.
చావు డప్పు నిరసన కాస్తా.. కేసీఆర్ చావును కోరుతున్నాం.. అనే దాకా తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే దీన్ని కవర్ చేసుకునేందుకు.. ఆయన వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అంటునే, అయితే గియితే ఆయన ఆరోగ్యం చెడిపోవాలని కోరుకునేది హరీశ్‌రావే అంటూ మళ్లీ పాత రాగమందుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.
స్వయానా కవితే ఈ విషయం చెప్పారంటూ… హరీశ్‌రావుకు క్షుద్రపూజలు చేయడం అలవాటని, కేసీఆర్ ఆరోగ్యం చెడిపోవాలని పూజలు చేయడం కూడా అతనికి అలవాటంటూ కవిత ఆ మధ్య కామెంట్స్ చేయడం ఇలా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కేసీఆర్ చావు కోరామంటూ తమని డిఫెన్స్‌లో పడేయాలని చూస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని .. వారి కుటుంబ అంతర్గత కలహాలను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసి వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్న మహేశ్.. అసెంబ్లీకి రావాలని కూడా సూచించారు. అయితే ఆ పార్టీ క్రమ శిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి మాట్లాడిన మాటలు మాత్రం చర్చకు తావిచ్చాయి. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలు కావాలనే బయట ప్రచారం చేస్తున్నారని, క్యాడర్ కోసమే ఇలా చెబుతున్నారంటే మల్లు రవి వ్యాఖ్యానించడం చర్చకు తెర తీసింది.
అంతే కాదు.. ఆయన ఇకపై ప్రజలలోకి రాలేరనే విధంగా మాట్లాడారు. గతంలో మాదిరిగా ఆయనకు ఆరోగ్యం సహకరించదని కూడా క్లారిటీ ఇచ్చేశారు తన తరుపున. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఇప్పుడే కాదు.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ ఉంది చర్చ. ఆయన ఇక ఎక్కువ రోజులు బతకలేరు.. క్యాన్సర్ ఉంది… లివర్ చెడిపోయిందనే ప్రచారాలు చేశారు.
ఈ ప్రచారాలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన రేవంత్‌నుద్దేశించి కేసీఆర్ ఈ రకమైన కామెంట్ చేశారు. పొద్దున లేచిన దగ్గర నుంచి తన చావును కోరుతున్నారని, వెయ్యి జన్మలెత్తినా తాను చావబోనని ఆయన ఘాటుగా స్పందించారు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ చావు కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్‌తో ఆయన ఆరోగ్యం గురించి రాజకీయాల్లో చర్చకు వచ్చింది.
దీనికి మల్లు రవి మరింత ఆజ్యం పోస్తూ.. ఆయన ఆరోగ్యం బాగాలేదని, బయటకు రాలేరనే విధంగా మాట్లాడటం కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగమై పోయినట్టుగా చూడాలి. మరోవైపు కేటీఆర్ తన నేతలతో కలిసి ఈ విషయంపై గవర్నర్‌కే ఫిర్యాదు చేయడం.. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.