Human Fridge: భారత్‌తో పాటు అనేక దేశాల్లో భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జపాన్‌లో కూడా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో అక్కడ జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన ఎండల నుండి ఉపశమనం అందించేందుకు జపనీస్ కంపెనీలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఒక వినూత్న పరికరం రూపుదిద్దుకుంది. అదే ‘దో హియేమోన్ బాక్స్’ (మనిషిని చల్లబరిచే ఫ్రిజ్). దీనికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Japan has invented refrigerators for people
A person enters a cabin, sits on a chair, and closes the door. The temperature inside is maintained at 15°C, while the neck, head, and back are cooled by a directed airflow chilled to 5°C.
According to the developers, spending just… pic.twitter.com/kausSkMA3s
— NEXTA (@nexta_tv) July 19, 2026
‘దో హియేమోన్ బాక్స్’ అని పిలిచే ఈ కూలింగ్ బూత్.. చూడటానికి ఒక పెద్ద ఫ్రిజ్‌లా ఉంటుంది. అయితే ఇది ఆహార పదార్థాల కోసం కాకుండా కేవలం మనిషి శరీరాన్ని చల్లబరచడానికి డిజైన్ చేశారు. జపాన్‌లోని ప్రసిద్ధ కూలింగ్ మెషిన్ల తయారీ సంస్థ ‘ఎస్‌డీఆర్ఎస్’ దీనిని తయారు చేయగా.. ‘ట్రస్కో నకయామా’ అనే సంస్థ దీని విక్రయాలను చూసుకుంటోంది.
ఈ బాక్స్ లోపలి ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే ఆహ్లాదకరమైన చల్లదనం లభిస్తుంది. అందులోని కుర్చీలో కూర్చోగానే సుమారు 5 డిగ్రీల సెల్సియస్ చల్లటి గాలి నేరుగా తల, మెడ, భుజాలు, వీపునకు తాకుతాయి. దీనివల్ల కేవలం ఐదు నిమిషాల్లోనే శరీరం వేడి నుంచి ఉపశమనం పొందుతుంది. ఒక 10 నిమిషాలు ఇందులో గడిపితే ఒత్తిడి, వడదెబ్బ లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
హ్యూమన్ ఫ్రిడ్జ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో గాలి వేగం, కూలింగ్‌కు సంబంధించి మూడు రకాల సెట్టింగ్స్ ఉంటాయి. అతిగా చల్లబడకుండా ఉండేందుకు 20 నిమిషాల తర్వాత ఇది తనంతట తానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది సగం మాత్రమే విద్యుత్తును వినియోగించుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి చక్రాలు ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది.
Also Read: భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!
ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్ ధరను జపాన్ కరెన్సీలో 15 లక్షల యెన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.8.87 లక్షలు. జపాన్ లో ఈ హ్యూమన్ ఫ్రిడ్జ్ ను గృహ అవసరాల కోసం కాకుండా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. కర్మాగారాలు, వేర్‌హౌస్‌లు, అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు ఉన్న సంస్థలకు మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే సాధారణ ఫ్రిడ్జ్ ల తరహాలో ఇవి కూడా గృహ అవసరాలకు అందుబాటులో రావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం