Motorola Wide Foldable: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. ఈ విభాగంలో శాంసంగ్ తమ గెలాక్సీ ఫోల్డ్ సిరీస్‌తో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు వినియోగదారులను ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ లోపాలను సరిదిద్దుతూ, మోటరోలా నుంచి తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త డివైజ్ Samsung Galaxy Z Fold 8కి గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది.
తాజా లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగంలో నిలువుగా కాకుండా అడ్డంగా ఉండే కెమెరా బార్‌ను అందించబోతున్నారు. శాంసంగ్ ఫోల్డ్ ఫోన్లలో కెమెరాలు ఒకే వైపు నిలువుగా ఉండటం వల్ల, ఫోన్‌ను టేబుల్‌పై ఉంచి వాడుతున్నప్పుడు అది ఊగుతూ ఉంటుంది. కానీ మోటరోలా డిజైన్ వల్ల ఫోన్ ఫ్లాట్ సర్ఫేస్‌పై స్థిరంగా ఉంటుంది. ఈ కెమెరా బార్‌లో మూడు కటౌట్స్ కనిపిస్తున్నాయి. ఇవి కెమెరాలు, ఫ్లాష్ లేదా ఇతర సెన్సార్ల కోసం కావచ్చు.
Also Read: AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!
సాధారణంగా చాలా ఫోల్డబుల్ ఫోన్లు తెరిచినప్పుడు చాలా పొడవుగా లేదా చిన్న స్క్రీన్‌తో ఉంటాయి. కానీ మోటరోలా దీనికి భిన్నంగా వెడల్పాటి ఆస్పెక్ట్ రేషియోతో ఈ ఫోన్‌ను రూపొందిస్తోంది. దీంతో ఫోన్ మూసి ఉన్నప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లాగే సౌకర్యవంతంగా వాడుకోవచ్చు. తెరిచినప్పుడు పెద్ద టాబ్లెట్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది. తద్వారా టైపింగ్ చేయడం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం చాలా సులభమవుతుంది.
స్క్రీన్ మడతపడే చోట గీత లేదా మడత కనిపిస్తుందేమోననే భయం చాలామందిలో ఉంటుంది. అయితే మోటరోలా ఈ డివైజ్‌లో గీత లేని క్రీజ్‌లెస్ డిస్‌ప్లేను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు చాలా సన్నని బాడీ, 3D గ్లాస్, ప్రీమియం ఫినిషింగ్‌తో ఈ ఫోన్ రాబోతోంది. ఫోన్‌ను చాలా తేలికగా తెరిచేందుకు వీలుగా ‘ఈజీ ఓపెన్ ప్రొఫైల్’ అనే ప్రత్యేక డిజైన్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.
మోటరోలా ఈ ఫోన్ పేరును, పూర్తి ఫీచర్లను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే లీకైన వార్తల ప్రకారం రాబోయే కొన్ని నెలల్లోనే ఈ వైడ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. డిజైన్, వాడకంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న ఈ ఫోల్డబుల్ డివైజ్, విడుదలయ్యాక స్మార్ట్‌ఫోన్ ప్రేమికులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!