India’s Most Beautiful Train Journeys: ట్రైన్ జర్నీ అంటే చాలా మంది ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడమే అనుకుంటారు. కానీ, కొన్ని రైలు ప్రయాణాలు మాత్రం వెళ్లాల్సిన ప్రదేశం కంటే, ప్రయాణాన్నే అందమైన అనుభూతిగా మార్చేస్తాయి. కిటికీ బయట అందమైన ప్రకృతి దృశ్యాలు, చిన్న స్టేషన్లు, కొండలు, నదులు, పచ్చని పొలాలు.. ఇలా రైల్లో ప్రయాణిస్తుంటే కనిపించే ప్రతి దృశ్యం మనసును ఆకట్టుకుంటుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా కొన్ని ప్రత్యేకమైన ట్రైన్ జర్నీస్ చేయాలని ట్రావెల్ ప్రియులు కోరుకుంటారు. అద్భుతమైన అనుభూతిని ఇచ్చే కొన్ని సీనిక్ ట్రైన్ జర్నీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కాశ్మీర్ లోయకు వెళ్లే రైలు ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా కొండల మధ్య సాగే మార్గంలో వంతెనలు, సొరంగాలు, లోయలు కనిపిస్తుంటాయి. రైలు కిటికీలోంచి బయటకు చూస్తూ ప్రయాణిస్తుంటే కలిగే ఆ అద్భుతమైన అనుభూతి చాలా కాలం గుర్తుండిపోతుంది.
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రాంతాలను కలుపుతూ సాగే కోంకణ్ రైల్వే మార్గం దేశంలోని అందమైన రైలు ప్రయాణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. వర్షాకాలంలో ఈ మార్గం మరింత పచ్చగా మారుతుంది. కొండలు, జలపాతాలు, నదులు, పచ్చని చెట్ల మధ్య రైలు దూసుకెళ్తుంటే ప్రయాణం ప్రత్యేకంగా అనిపిస్తుంది.
కొండల మధ్య నెమ్మదిగా సాగే చిన్న రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఎక్స్ పీరియెన్స్ చేయాలంటే దార్జిలింగ్ హిమాలయన్ రైల్వే బెస్ట్ ఆప్షన్. పర్వత ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూ దార్జిలింగ్ అందాలను ఆస్వాదించవచ్చు. రైలు వేగం కంటే చుట్టూ కనిపించే ప్రకృతి ఈ జర్నీలో అసలైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో సాగే ఈ రైలు ప్రయాణం మరో ప్రత్యేక అనుభూతి. కొండలు, అడవులు, టీ తోటలు, లోయల మధ్య ప్రయాణం సాగుతుంది. సాధారణ రైలు ప్రయాణానికి భిన్నంగా ఉండటంతో ట్రావెల్ లవర్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలను ఆస్వాదిస్తూ ప్రయాణించాలనుకునేవారికి కల్కా-షిమ్లా రైల్వే మార్గం ఆకట్టుకుంటుంది. చిన్న రైలు కొండలను చుట్టుకుంటూ ముందుకు సాగుతుంటే సొరంగాలు, వంతెనలు, లోయలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో ఈ ప్రయాణం మరింత ఆహ్లాదంగా ఉంటుంది.
ఈ రైలు ప్రయాణాల్లో ప్రత్యేకత కేవలం చేరుకునే ప్రదేశంలో ఉండదు. మధ్యలో కనిపించే దృశ్యాలు, తోటి ప్రయాణికులతో కలిసి చేసే ఎంజాయ్, స్టేషన్లలో తీసుకునే టీ, కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి అందాలను చూడటం.. ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అందుకే ఎప్పుడూ విమానం, కారులోనే ప్రయాణించకుండా.. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారు, ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు, కొత్త అనుభూతి కోసం ఎదురుచూసేవారికి ఈ జర్నీస్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్లాన్ చేసుకుంటే.. ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది.
Read Also: 11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!