OTP Scam: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరస్థులు తమ పంథాను మారుస్తున్నారు. మనీ ట్రాన్స్ ఫర్ కు అత్యంత కీలకమైన ఓటీపీలను ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బును దోచేస్తున్నారు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పి.. ఆరు అంకెల ఓటీపీ కోడ్ ను సైబర్ నేరస్థులు సేకరిస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. మీ అంతట మీరే OTP షేర్ చేస్తే అది కస్టమర్ తప్పిదంగానే పరిగణిస్తారు. మోసాన్ని బ్యాంక్‌కి రిపోర్ట్ చేసే వరకు జరిగే నష్టానికి బాధితుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పొరపాటున ఎవరికైనా ఓటీపీ షేర్ చేస్తే వెంటనే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
తప్పుడు వ్యక్తులకు ఓటీపీ షేర్ చేసినట్లు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సర్వీసులను తక్షణమే ఫ్రీజ్ చేయాలని కోరాలి. ఎంత వేగంగా ఈ పని చేస్తే.. డబ్బును అంతగా త్వరగా కాపాడుకోవచ్చు.
ఒకవేళ ఖాతాలో డబ్బు కట్ అయినట్లు అనిపిస్తే.. వెంటనే జాతీయ సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ నంబర్ అయిన 1930కి కాల్ చేయాలి. లేదంటే cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత ఫాస్ట్ గా మోసగాళ్ల ఖాతాలోని డబ్బును నిలిపివేసే అవకాశం (Freeze) అధికారులకు దక్కుతుంది.
పొరపాటున ఓటీపీ షేర్ చేసిన వెంటనే నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూపీఐ పిన్, కార్డ్ పిన్‌లను కూడా వెంటనే మార్చండి. పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లను పిన్లుగా అస్సలు పెట్టకండి. ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను కూడా మార్చడం ముఖ్యం, ఎందుకంటే మోసగాళ్లు తరచుగా ఈమెయిల్ ఆధారంగానే ఇతర ఖాతాలను రీసెట్ చేస్తుంటారు.
మీకు వచ్చిన OTP మెసేజ్‌ను మరోసారి చదవండి. అందులో సాధారణంగా దేనికోసం, ఎంత మొత్తం కోసం ఆ కోడ్ వచ్చింది అనే వివరాలు ఉంటాయి. ఆ తర్వాత మీ ఖాతాను చెక్ చేయండి. ఆటో పే వంటి ఫీచర్లు యాక్టివ్ గా ఉండి వాటిని ఆఫ్ చేయండి. ఒకవేళ అప్పటికే డబ్బు డెబిట్ అయి ఉంటే ఆ లావాదేవీకి సంబంధించిన ఖచ్చితమైన ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్‌ను బ్యాంక్‌కి అందించండి.
Also Read: చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
ఓటీపీ షేర్ చేసిన సమయం, బ్యాంక్‌కి కాల్ చేసిన సమయం, అన్ని ఫిర్యాదు నంబర్లను నోట్ చేసి పెట్టుకోండి. ఆ వివరాలతో ఈమెయిల్ ద్వారా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. 30 రోజుల్లోగా బ్యాంక్ నుంచి సరైన స్పందన రాకపోతే cms.rbi.org.in ద్వారా మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సవరించిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు దేశీయ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను 45 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.
Also Read: పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి