Smart Condoms: చాలామందికి తమ పార్ట్‌నర్‌కు లైంగిక వ్యాధులు (STDs) ఉన్నాయన్న విషయం తెలియక ప్రమాదంలో పడుతుంటారు. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. సెక్స్ సమయంలోనే వ్యాధులను గుర్తించి, రంగు మారడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేసే అద్భుతమైన కండోమ్స్‌ను ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఏ రంగు వస్తే ఏ జబ్బు ఉన్నట్టు? పూర్తి వివరాలు ఈ కథనంలో..
బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివే కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఈ వినూత్నమైన ప్రయోగాన్ని చేశారు. ఒక హెల్త్ కాంపిటీషన్‌లో భాగంగా వీరు దీన్ని రూపొందించారు. ఇది మామూలు కండోమ్ లాగే ఉంటుంది కానీ, దీని పనితీరు మాత్రం వేరు. కేవలం ప్రెగ్నెన్సీ రాకుండా చూడటమే కాదు.. మన బాడీలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటిని ముందే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తుంది. అంటే.. ఇద్దరి మధ్య బంధం కొనసాగుతున్నప్పుడే ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఇది ఇచ్చేస్తుందన్నమాట.
చాలామందికి డౌట్ రావచ్చు.. ఇది రంగు ఎలా మారుతుంది? అని. ఈ కండోమ్ తయారీలో లేటెక్స్ పొరల మధ్య ఒక ప్రత్యేకమైన రియాక్టివ్ లేయర్‌ను అమర్చారు. మన శరీరంలో క్లామిడియా లేదంటే గనేరియా వంటి వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు విడుదలవుతాయి. ఆ ప్రోటీన్లు ఈ కండోమ్ మీద ఉన్న లేయర్‌కు తగలగానే రియాక్షన్ మొదలైపోతుంది. ఎలాంటి మిషన్లు, కెమికల్ టెస్టులు అవసరం లేకుండానే సెకన్ల వ్యవధిలో మన కళ్ల ముందే కలర్ మారిపోతుంది.
Also Read: ఈ 8 రకాల బట్టలను చన్నీళ్లతో ఉతికితే రోగాలొస్తాయట.. తస్మాత్ జాగ్రత్త!
దీనిలో మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇది ఒక్క రంగులోకి మాత్రమే మారదు. లోపల ఉన్న ఇన్ఫెక్షన్‌ను బట్టి రంగు మారుతుంది. ఉదా: ఒక రకమైన వైరస్ ఉంటే నీలం రంగులోకి, మరో రకమైన బ్యాక్టీరియా ఉంటే ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అంటే.. ఏ రంగు వచ్చిందో చూసి, మనకు ఏ సమస్య ఉండొచ్చనేది ఒక అంచనాకు రావచ్చు. డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపే పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఇది కల్పిస్తోంది.
చాలామందికి తమకు వ్యాధి ఉందని తెలియక దాన్ని వేరే వాళ్లకు కూడా అంటించేస్తుంటారు. దీనివల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. అదే ఈ కండోమ్ వాడితే.. ఇన్ఫెక్షన్ ఉందన్న విషయం అప్పటికప్పుడే తెలుస్తుంది కాబట్టి.. వెంటనే చికిత్స తీసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాణాలను కాపాడే సాధనంగా మారుతుందని అందరూ ఆశిస్తున్నారు.
అయితే ఇప్పుడే ఇది షాపుల్లో దొరకదు సుమా. ప్రస్తుతానికి ఇది ఒక ప్రయోగం మాత్రమే. ల్యాబ్‌లో చేసిన టెస్టుల్లో ఇది పక్కాగా రిజల్ట్స్ ఇచ్చింది. కానీ జనాల్లోకి రావాలంటే మరికొన్ని ప్రభుత్వ అనుమతులు, క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ దాటుకుని మార్కెట్లోకి వస్తే మాత్రం, లైంగిక ఆరోగ్య విషయంలో ఇదొక పెద్ద విప్లవమే అని చెప్పాలి.
Also Read: మోటరోలా, ఒప్పో ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ఎంత ధర తగ్గిందంటే?