Phone Battery Explosion: అప్పుడప్పుడూ న్యూస్ పేపర్లలోనే లేదంటే టీవీల్లోనే ఇలాంటి వార్తలు చూసే ఉంటాం. జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్ లేదా ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటే పేలిపోవడం ఇలా.. మన చుట్టూ చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల వలన ప్రాణాలు సైతం పోతాయి. మొన్నటికి మొన్న లక్నోలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి మూడేళ్ల చిన్నారి చనిపోవడం వింటేనే గుండె తరుక్కుపోతుంది. అసలు ఫోన్ ఎందుకు పేలుతుంది? మనం తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు మనల్ని ప్రమాదంలోకి నెడుతున్నాయా? నిపుణులు చెబుతున్న ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
చాలా మందికి రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఫోన్లలో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫీచర్లు ఉన్నా.. గంటల తరబడి ప్లగ్ ఇన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు గేమ్స్ ఆడటం లేదా వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు. దీనివల్ల లోపల ఉండే లిథియం బ్యాటరీ విపరీతంగా వేడెక్కి ఒకేసారి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఫోన్ వాడుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కడం మామూలే. కానీ, ముట్టుకోలేనంత సెగ వస్తుంటే మాత్రం అది డేంజర్ సిగ్నల్ అని గుర్తుంచుకోండి. ఏ పనీ చేయకపోయినా ఫోన్ ఊరికే వేడెక్కుతున్నా, ఛార్జింగ్ పెట్టినప్పుడు కాలిపోతున్నట్లు అనిపించినా ఆ బ్యాటరీలో ఏదో లోపం ఉందని అర్థం. వెంటనే ఛార్జర్ తీసేసి ఫోన్ కాసేపు పక్కన పెట్టడం మంచిది.
ఫోన్ బ్యానల్ (వెనుక భాగం) కొంచెం ఉబ్బినట్లు అనిపించినా లేదా స్క్రీన్ పక్కల నుంచి ఏవైనా గ్యాప్‌లు కనిపిస్తున్నా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. బ్యాటరీ లోపల రసాయన చర్యలు తేడా కొట్టినప్పుడే అది అలా ఉబ్బుతుంది. ఇలాంటి ఫోన్ వాడటం అంటే జేబులో బాంబు పెట్టుకుని తిరగడమే. అలాగే బ్యాటరీ పర్సంటేజీ టకటక తగ్గిపోతున్నా, ఫోన్ దానంతట అదే ఆఫ్ అవుతున్నా వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.
రోడ్డు పక్కన దొరికే లేదా తక్కువ రేటుకు వస్తున్నాయని ఏ ఛార్జర్ పడితే అది వాడొద్దు. ఆ ఛార్జర్లలో వోల్టేజ్ కంట్రోల్ ఉండదు. దాంతో బ్యాటరీ దెబ్బతింటుంది. వీలైనంత వరకు కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడాలి. అలాగే ఫోన్ కిందపడితే.. పైన స్క్రీన్ బాగుంది కదా అని వాడేస్తుంటాం. కానీ లోపల బ్యాటరీ దెబ్బతిని ఉండొచ్చు. అందుకే ఫోన్ కింద పడ్డాక వేడెక్కుతున్నట్లు అనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే.
ఫోన్‌ను తీసుకెళ్లి ఎండలో పెట్టడం లేదా కారు డ్యాష్ బోర్డ్ మీద వదిలేయడం ప్రమాదకరం. అలాగే నిద్రపోయేటప్పుడు తల పక్కన లేదా దిండు కింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టొద్దు. అక్కడ గాలి ఆడక ఫోన్ ఇంకా వేడెక్కుతుంది. ఫోన్ నుంచి ఏదైనా కాలిన వాసన వస్తున్నా, పొగ వస్తున్నా వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. మనం తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మనల్ని, మన కుటుంబాన్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి.
Also Read: Galaxy S26 యూజర్ల కోసం One UI 9 బీటా లాంచ్.. మీ ఫోన్ లుక్ మార్చేసే 5 క్రేజీ ఫీచర్లు ఇవే!