Call drop problem reasons: మనం ఎవరితోనైనా అత్యంత ముఖ్యమైన విషయంపై.. మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా.. కాల్ కట్ అవ్వడం ఎంత చిరాకు తెప్పిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మొబైల్‌లో.. పూర్తి నెట్‌వర్క్ సిగ్నల్స్ కనిపిస్తున్నప్పటికీ పదే పదే కాల్స్ మధ్యలో డిస్‌కనెక్ట్ కావడం నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనిని ‘కాల్ డ్రాప్’ అంటారు. అసలు ఫోన్ ఫుల్ సిగ్నల్ ఉన్నా ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని వెనక ఉన్న కారణాలు, తక్షణ పరిష్కారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మనం ఉన్న ప్రాంతంలో టెలికాం టవర్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది యూజర్లు ఒకే సమయంలో కాల్స్ మాట్లాడటం వల్ల నెట్‌వర్క్ కనెక్షన్ క్షీణిస్తుంది. దీనినే ‘నెట్‌వర్క్ కంజెషన్’ అంటారు. టవర్ సామర్థ్యం తగ్గడం వల్ల సిగ్నల్స్ ఉన్నప్పటికీ కాల్స్ మధ్యలోనే కట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ , 5జీ నెట్‌వర్క్‌లలో వాయిస్ కాల్స్ డేటా రూపంలో ప్రయాణిస్తాయి. మొబైల్ సిగ్నల్ మార్పులకు లోనైనప్పుడు లేదా నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా.. 4జీ నుంచి 3జీకి మారుతున్న సమయంలో సెకన్ల వ్యవధిలో కనెక్షన్ కోల్పోయి కాల్ డ్రాప్ అవుతుంది.
కొన్నిసార్లు మీ మొబైల్‌లో వేసిన సిమ్ కార్డ్ పాడైపోవడం లేదా సరిగ్గా అమర్చకపోవడం.. వల్ల కూడా సిగ్నల్ సరిగ్గా అందదు. అలాగే మొబైల్ ఇంటర్నల్ యాంటెన్నాలో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నా కాల్స్ సరిగ్గా కనెక్ట్ కావు.
ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించవచ్చు.
ఎయిర్‌ప్లేన్ మోడ్: మీ ఫోన్‌లో ఏడబ్ల్యూ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, ఒక నిమిషం తర్వాత మళ్లీ ఆఫ్ చేయండి. దీని వల్ల నెట్‌వర్క్ రీసెట్ అయ్యి సిగ్నల్ పెరుగుతుంది.
నెట్‌వర్క్ టైప్ మార్చడం: మీ ప్రాంతంలో 5జీ సిగ్నల్ సరిగ్గా లేకపోతే, నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో కేవలం 4జీ (LTE) మాత్రమే ఆప్షన్‌గా సెలెక్ట్ చేసుకోండి.
సిమ్ కార్డ్ క్లీనింగ్: ఫోన్ పవర్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్‌ను బయటకు తీసి, శుభ్రంగా తుడిచి మళ్లీ సరిగ్గా అమర్చండి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: మీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం ద్వారా.. నెట్‌వర్క్ బగ్స్ తొలగిపోతాయి.
Also Read: డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !
కాల్ డ్రాప్ సమస్య కేవలం.. మన ఫోన్ లోపం వల్లే కాకుండా టెలికాం కంపెనీల మౌలిక వసతుల లోపం వల్ల కూడా వస్తుంది. TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం టెలికాం ఆపరేటర్లు నాణ్యమైన సేవలను అందించాలి. ఒక వేళ మీ ప్రాంతంలో.. నిరంతరం ఈ సమస్య ఉంటే.. మీ టెలికాం కస్టమర్ కేర్‌కు కంప్లైంట్ చేయడం మంచిది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు. సర్వీస్ ప్రొవైడర్లు ఉచితంగానే.. నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరిస్తారు.
కాల్ డ్రాప్ అనేది నేడు దాదాపు అందరూ ఎదుర్కొంటున్న.. చిన్న సమస్యే అయినప్పటికీ, ఇది మన పనికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పైన తెలిపిన చిన్న చిన్న సెట్టింగ్స్ మార్పుల ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాంతంలో.. టవర్ సమస్య ఎక్కువగా ఉంటే.. మీ సిమ్ నెట్‌వర్క్‌ను మార్చడం లేదా కంపెనీకి కంప్లైంట్ చేయడం బెస్ట్ మార్గం.