ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్(Nothing) వ్యవస్థాపకుడు, సీఈఓ కార్ల్ పీ స్మార్ట్ ఫోన్ లవర్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. 2026లో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగే ఛాన్స్ ఉందని అన్నారు. ముఖ్యంగా బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగాల్లో పనిచేసే బ్రాండ్‌లు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలక్రమేణా టెక్నాలజీ చౌకగా మారుతుందనే పాత అంచనాలు ఇకపై చెల్లవని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో DRAM, NAND ఫ్లాష్ మెమొరీ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ భాగాలు స్మార్ట్‌ఫోన్‌లలో ర్యామ్ (RAM), స్టోరేజ్ కోసం అత్యంత కీలకం. గడిచిన కొద్ది కాలంలోనే గ్లోబల్ మెమొరీ ధరలు దాదాపు 500 శాతం వరకు పెరిగాయని, ఎస్ఎస్‌డీ (SSD) ధరలు కూడా 100 శాతం వృద్ధి చెందాయని నివేదికలు చెబుతున్నాయి. గతంలో 20 డాలర్ల లోపు లభించే మెమరీ మాడ్యూల్స్.. ఇప్పుడు టాప్-టైర్ డివైజ్‌ల కోసం 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని కార్ల్ పీ చెబుతున్నారు.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI డేటా సెంటర్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన మెమోరీ భాగాలనే ఈ డేటా సెంటర్లు కూడా ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, AI మౌలిక సదుపాయాల సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ డిమాండ్ సరఫరాను మించిపోవడంతో.. మెమొరీ ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చు (Bill of Materials) విపరీతంగా పెరిగిపోయింది.
కార్ల్ పీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ద్వారా కీలక విషయాలు వెల్లడించారు. నథింగ్ ఫోన్ల ధరలు కూడా తప్పనిసరిగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా 2026 మొదటి త్రైమాసికంలో విడుదలయ్యే కొత్త ఫోన్లలో వేగవంతమైన UFS 3.1 స్టోరేజ్‌ను ఉపయోగించడం వల్ల ధరల భారం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు ఈ అదనపు ఖర్చులను భరించలేక.. చివరకు ఆ భారాన్ని వినియోగదారులపైనే వేయక తప్పని పరిస్థితి నెలకొందని వివరించారు
కేవలం నథింగ్ మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ కూడా తన రాబోయే గెలాక్సీ S26 (Galaxy S26) సిరీస్ ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ 2026 ఫిబ్రవరి 25న విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారికంగా ఇంకా ఖరారు కానప్పటికీ, పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రీమియం ఫోన్ల ధరలు కూడా కొత్త రికార్డులను తాకవచ్చు. మొత్తం మీద, మీరు 2026లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. గతంలో కంటే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించుకోవాల్సిందే.