Sony WH 1000XM4C: మ్యూజిక్ లవర్స్‌కి, ముఖ్యంగా క్వాలిటీ ఆడియో కోరుకునే వారికి సోనీ హెడ్‌ఫోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన సోనీ WH-1000XM4 ఎంతటి ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మోడల్‌ను మరింత తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. సోనీ WH-1000XM4C పేరుతో రాబోతున్న ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
డిజైన్ విషయానికి వస్తే.. ఇది పాత మోడల్‌ను పోలి ఉంటుంది. మడతబెట్టుకోవడానికి వీలుగా ఉండే ఫోల్డబుల్ ఓవర్-ఈర్ డిజైన్‌తోనే ఇది వస్తోంది. దీని బరువు కేవలం 253 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈసారి ల్యావెండర్ అనే కొత్త కలర్ ఆప్షన్‌తో పాటు బ్లాక్, ప్లాటినమ్ సిల్వర్ రంగుల్లో లభించనుంది. అయితే ధర తగ్గించేందుకు ఆరిజినల్ మోడల్‌లో ఉన్న NFC ఫీచర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మాత్రం యథావిధిగా ఉంటాయి.
Also Read: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!
టెక్నాలజీ పరంగా ఇందులో కొన్ని ఆసక్తికర మార్పులు ఉన్నాయి. పాత మోడల్‌లో బ్లూటూత్ 5.0 ఉండగా.. ఈ కొత్త వెర్షన్‌లో బ్లూటూత్ 6.0 సపోర్ట్ రానుంది. ఆడియో క్వాలిటీ కోసం ఇందులో 40ఎంఎం డ్రైవర్లను అందించారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, బయటి శబ్దాలు వినబడకుండా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ధర తగ్గించడం వల్ల బ్యాటరీలో స్వల్ప మార్పు జరిగింది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్‌లో ఉంటే 27 గంటలు, ఆఫ్ చేస్తే 34 గంటల వరకు బ్యాటరీ వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే.. ఇది కాస్త తక్కువే అయినప్పటికీ దైనందిన వాడకానికి ఈ బ్యాటరీ లైఫ్ సరిపోతుంది. దీంతోపాటు ఇచ్చే క్యారీయింగ్ కేస్ కూడా ఈసారి సాధారణంగా ఉండబోతోంది.
ఇక ధర విషయానికి వస్తే.. యూరోప్‌లో దీని ధర రూ.27,300గా ఉంది. పాత మోడల్ ప్రారంభ ధరతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఆడియో అనుభవాన్ని కోరుకునే వారికి ఈ సోనీ హెడ్‌ఫోన్స్ మంచి ఆప్షన్ కానున్నాయి. కంపెనీ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.
Also Read: ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!