Cheap Projector Hacks: ఈ ఆధునిక యుగంలో భారీ టీవీలు కొనడం కంటే ఇంట్లోనే పెద్ద స్క్రీన్‌పై సినిమా అనుభూతిని పొందడానికి చాలామంది ప్రాజెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్ ధరలో లభించే ప్రాజెక్టర్లు వంద అంగుళాల డిస్ప్లేను ఇవ్వగలిగినా, డిజైన్ లేదా బ్రైట్‌నెస్ విషయంలో కొంత నిరాశపరుస్తాయి. కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ చౌకైన ప్రాజెక్టర్ నుండి కూడా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని పొందవచ్చు.
భారీ టీవీ కొనడం కంటే తక్కువ బడ్జెట్‌లోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడాలనుకునేవారికి ప్రాజెక్టర్ మంచి ఆప్షన్. అయితే ప్రాజెక్టర్ ఎంత ఖరీదైనదైనా.. దాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నామన్నది పిక్చర్ క్వాలిటీపై చాలా ప్రభావం చూపుతుంది. గోడపై నేరుగా ప్రొజెక్ట్ చేస్తే చిన్న చిన్న మచ్చలు, రంగు తేడాలు కనిపించి బొమ్మ అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. అందుకే వీలైతే మంచి ALR (Ambient Light Rejecting) స్క్రీన్‌ను ఉపయోగించండి. ఇది కాంతిని సమానంగా పరావర్తనం చేసి కలర్స్, కాంట్రాస్ట్‌ను మరింత మెరుగ్గా చూపిస్తుంది.
Also Read: రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!
బడ్జెట్ ప్రాజెక్టర్లలో బ్రైట్‌నెస్ సాధారణంగా పరిమితంగానే ఉంటుంది. కాబట్టి.. సినిమా చూసేటప్పుడు గదిలోని లైట్లను ఆఫ్ చేయడం లేదా డిమ్ చేయడం మంచిది. పగటిపూట సినిమాలు చూడాలంటే కిటికీలకు బ్లాకౌట్ కర్టెన్లు ఉపయోగించడం చాలా ఉపయోగపడుతుంది. గది గోడలకు డార్క్, మ్యాట్ కలర్స్ ఉంటే కాంతి రిఫ్లెక్షన్ కూడా తగ్గుతుంది. దీంతో స్క్రీన్‌పై బొమ్మ మరింత బ్రైట్‌గా, క్లియర్‌గా కనిపిస్తుంది.
ప్రాజెక్టర్‌ను ఆన్ చేసి అలాగే వాడటం కంటే.. దాని సెట్టింగ్స్‌ను ఒకసారి కరెక్టుగా సెట్ చేసుకోవడం మంచిది. ఇమేజ్ వంకరగా కనిపిస్తే Keystone Correction ఉపయోగించండి. ఫోకస్‌ను మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసి బొమ్మను షార్ప్‌గా మార్చుకోవచ్చు. అలాగే ప్రాజెక్టర్ సపోర్ట్ చేసే రెజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌కు అనుగుణంగా వీడియో సోర్స్‌ను సెట్ చేస్తే కదిలే దృశ్యాలు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి.
ప్రాజెక్టర్ పనితీరును దెబ్బతీసే ప్రధాన కారణాల్లో వేడి, దుమ్ము కూడా ఉన్నాయి. వెంటిలేషన్ రంధ్రాలను ఎప్పుడూ మూసి ఉంచొద్దు. గాలి సరిగ్గా ప్రసరించేలా తగినంత ఖాళీ ఉంచండి. ఎప్పటికప్పుడు దుమ్మును శుభ్రం చేయడం వల్ల ప్రాజెక్టర్ ఎక్కువ కాలం మెరుగ్గా పనిచేస్తుంది. అవసరమైతే కూలింగ్ ప్యాడ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చౌకైన ప్రాజెక్టర్‌తోనూ ఇంట్లోనే మంచి హోమ్ థియేటర్ అనుభూతిని పొందొచ్చు.
Also Read: డిమార్ట్‌లో విడిగా అమ్మే సరుకులకు ఎక్స్‌పైరీ డేట్స్ ఉండవా? FSSAI నిబంధనలు ఏం చెబుతున్నాయ్?