Home appliance safety in summer: భానుడు భగభగమంటున్నాడు. బయట అడుగుపెట్టాలంటేనే.. భయమేసే రేంజ్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమ్మర్ హీట్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఇంట్లో ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు రోజంతా ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతుంటాయి. అయితే..మనుషులకే కాదు, మనం వాడే ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌కు కూడా ఈ ఎండ కాలంలో ఎక్స్‌ట్రా కేర్ అవసరం. వేసవిలో లోడ్ ఎక్కువై ఇవి పాడయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సీజన్‌లో ఏ అప్లయెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ? వాటి సర్వీసింగ్ ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఎన్నేళ్లయినా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవకూడదంటే ?
ఏసీ మెయింటెనెన్స్, ఖర్చులు:
ఎండ కాలంలో అత్యధికంగా వాడేది ఏసీనే.. కాబట్టి దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజంతా ఆన్ చేసి ఉంచడం వల్ల కంప్రెషర్‌పై లోడ్ విపరీతంగా.. పెరుగుతుంది. అందుకే.. నెలకు ఒక సారి ఏసీ ఫిల్టర్లను తప్పకుండా క్లీన్ చేయాలి. లేదంటే ధూళి చేరి కూలింగ్ తగ్గిపోతుంది. అలాగే అవుట్‌డోర్‌లో నేరుగా ఎండ తగలకుండా.. షేడ్ ఉండేలా చూసుకోవడం మంచిది. ఏసీని ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య రన్ చేయడం వల్ల మిషన్ సేఫ్‌గా ఉంటుంది. అంతే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఇక ధరల విషయానికి వస్తే.. బేసిక్ ఏసీ సర్వీసింగ్ లేదా డీప్ జెట్ క్లీనింగ్ ఛార్జీలు సాధారణంగా రూ.300 నుంచి రూ. 999 వరకు ఉంటాయి. ఒకవేళ గ్యాస్ లీక్ అయ్యి రీఫిల్లింగ్ లేదా టాప్-అప్ అవసరమైతే మాత్రం రూ.2,000 నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతుంది.
ఫ్రిజ్-సర్వీసింగ్ వివరాలు:
సమ్మర్‌లో ఫ్రిజ్ ఓపెన్ చేయని ఇల్లు ఉండదు. ఐస్ వాటర్, ఐస్‌క్రీమ్స్, కూరగాయల కోసం ఫ్రిజ్‌ని పదే పదే తీస్తూ ఉండటం వల్ల.. లోపలి కూలింగ్ బయటకు పోయి, కంప్రెషర్ ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. ఫ్రిజ్‌ను గోడకు మరీ అతుక్కుని పెట్టకుండా కనీసం 6 ఇంచుల గ్యాప్ ఉంచాలి, దీని వల్ల వెనక ఉండే హీట్ సులభంగా బయటకు పోతుంది. ఫ్రిజ్ డోర్ రబ్బర్ (గ్యాస్కెట్) లూజ్‌గా ఉందో లేదో.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో జనరల్ ఫ్రిజ్ చెకప్, క్లీనింగ్, బేసిక్ రిపేర్ ఖర్చులు రూ. 400 నుంచి ప్రారంభమై రూ. 1,500 వరకు ఉంటాయి.
ఎయిర్ కూలర్, క్లీనింగ్ , రీపేర్ ఖర్చులు:
మిడిల్ క్లాస్ ఇళ్లలో ఏసీ కంటే ఎక్కువగా కూలర్లనే వాడుతుంటారు. అయితే సమ్మర్‌లో కూలర్ల వల్ల ఫంగస్, చెడు వాసన వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే.. కూలర్ ట్యాంక్‌లోని పాత నీటిని వారానికి ఒకసారైనా మార్చడం అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు కూలింగ్ ప్యాడ్స్‌ను బాగా క్లీన్ చేయాలి. లేదంటే బాక్టీరియా చేరి గాలి చెడు వాసన వస్తుంది. వేసవిలో పాత ప్యాడ్స్ మార్చడానికి, కంప్లీట్ కూలర్ క్లీనింగ్ చేయించడానికి సాధారణంగా రూ. 300 నుంచి రూ. 700 వరకు ఖర్చవుతుంది.
Also Read: ఇల్లు ఐస్ ముక్కలా అయిపోవాల్సిందే! కరెంట్ బిల్లు తగ్గించే 3 స్టార్, 5 స్టార్ ఏసీ మోడల్స్!
ఓల్టేజ్ స్టెబిలైజర్ ప్రాధాన్యత, ధరలు:
సమ్మర్‌లో అందరూ ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఒకేసారి ఆన్ చేయడం వల్ల పవర్ ఫ్లక్చుయేషన్స్ (వోల్టేజ్ హెచ్చుతగ్గులు) చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మీ ఇంట్లోని కాస్ట్‌లీ అప్లయెన్సెస్ కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంట్లోని ఏసీ, స్మార్ట్ టీవీ, ఫ్రిజ్‌లకు మంచి క్వాలిటీ వోల్టేజ్ స్టెబిలైజర్ ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఒక మంచి బ్రాండెడ్ స్టెబిలైజర్ ధర రూ.1,500 నుంచి ప్రారంభమై రూ. 4,000 వరకు ఉంటుంది.
స్మార్ట్ టిప్:
సమ్మర్ పీక్‌లోకి వెళ్ళకముందే అంటే మార్చి లేదా ఏప్రిల్‌లోనే అప్లయెన్సెస్ సర్వీసింగ్ చేయించుకుంటే.. తక్కువ ధరలకే సర్వీస్ దొరుకుతుంది. పైగా ఎండలు ముదిరాక మిషన్లు మొరాయించకుండా హ్యాపీగా కూలింగ్ ఇస్తాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ అప్లయెన్సెస్ లైఫ్ పెరగడమే కాదు. మీ జేబుకు కరెంట్ బిల్లు పెరగకుండా కూడా చూసుకోవచ్చు.