మహేశ్‌కు సొంత గడ్డ ఇందూరుపై పట్టు లేదు. ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి మూడు సార్లు పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఓడిపోయాడు. ఇక ఆశలు వదలుకున్నాడు. ప్రత్యక్షరాజకీయాలకు దూరమైనట్టేనని భావించాడు. తంతే బూరల బుట్టలో పడ్డట్టు ఆయనకు పీసీసీ చీఫ్ పదవి దక్కింది. దీంతో ఆయన మళ్లీ తన సొంత గడ్డపై తన పరపతి చాటుకునే క్రమంలో గ్రూపు రాజకీయాలకు తెర లేపాడు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు.
ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి సర్ది చెప్పారు. ఇక సీనియర్లుగా ఉన్న వారందరికీ దాదాపుగా చెక్ పెట్టాడు. వారిని ఎవరికీ దగ్గరికి చేరనీయలేదు. ఎమ్మెల్సీగా కూడా అవకాశం దక్కించుకున్న తరుణంలో అక్కడ జిల్లా యంత్రాంగంపై తన పట్టు ఉండాలనుకున్నాడు. ఏ కార్యక్రమాలు జరిగినా తనను పిలవాలని హుకుం జారీ చేశాడు. పీసీసీ చీఫ్ తనే, మంత్రి తనే, ఎమ్మెల్యే తనే, ఎమ్మెల్సీ తనే … ఇలా ఇన్ని రకాల హోదాలతో జిల్లా రాజకీయాలన్నీ తన చుట్టే తిప్పుకున్నాడు. డీఎస్ వర్గానికి పూర్తిగా చెక్ పెట్టాడు. దీంతో పాటు సుదర్శన్‌రెడ్డి వర్గానికీ చెక్ పెట్టాడు. అంతా తన టీమే ఉండాలనుకున్నాడు. ఈ పరిణామాల వల్ల మరింత గ్రూపు రాజకీయాలను పెంచి పోషించినట్టయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగిన జిల్లాలు రెండో మూడో.. కానీ వారానికి రెండు, మూడు సార్లు మాత్రం జిల్లా పర్యటనలకు వస్తాడు. ఇక్కడి నేతలకు పార్టీ పదవులు ఇచ్చే విషయంలో కూడా కావాలనే తాత్సారం చేస్తూ వచ్చారాయన. ఇంటికి పెద్ద అంటే ఎట్లుండాలె? అందరినీ కలుపుకుని పోవాలె. కానీ ఈయన మాత్రం అన్ని గ్రూపులు చేసి వదిలి పెట్టాడు. ఎవరైనా సరే తన గ్రూపులోకి రావాల్సిందేననే పరోక్షంగా సంకేతాలిచ్చి వదిలాడు. కానీ ఇందూరులో చాలా మంది సీనియర్ నేతలున్నారు. హేమాహేమీలున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దుముఖం ఎరుగడు అన్నట్టుగా.. ఇప్పుడు మహేశ్ కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇలాగే ఉండాలె.. నేను చెప్పిందే నడవాలనే మోనోపలి నిర్ణయాలు ప్రవేశపెట్టడం వారిని మరింత రెచ్చగొట్టే దోరణిలోకి తీసుకుపోయింది.
దీంతో ఇక్కడ నేతల మధ్య ఆరోగ్యకరమైన రాజకీయ పరిస్థితులను క్రియేట్ చేయడం అటుంచి…. గ్రూపులు మరీ పెరగిపోయి.. సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికి, పార్టీ పరువును బజారుకీడ్చేటందుకు. ఇవన్నీ మహేశ్‌కు తెలుసు. కానీ వాటిని సైలెంట్‌గా చూస్తూ లోలోన ఆనంద పడే మెంటాలిటీ వల్ల తనకు అసలు ఏం తెలియదన్నట్టు నటిస్తూ వస్తున్నాడు. మేయర్ ఎన్నికల్లో కూడా మహేశ్ మార్కు పెద్దగా చూపించలేకపోయాడు. ఇక్కడ బీజేపీని తట్టుకోవడం తన వల్ల కాదనే విధంగా చేతులెత్తేసినట్టే చేశాడు మహేశ్. ఎట్టకేలకు ఎంఐఎం సపోర్టుతోనే గట్టెక్కారు తప్ప.. మహేశ్ మంత్రాంగం అక్కడ పనిచేయలేదు. ఇటు ఇంటా గెలవలేదు.
అటు రచ్చా గెలవలేదు. చాలా సార్లు ఆయన ప్రెస్‌మీట్‌లలో మాట్లాడిన మాటలు సబ్జెక్టు వైస్‌గా కాకుండా.. పైపైన లోకల్ లీడర్ చేసే ఆరోపణల్లాగే పేలవంగా ఉంటాయి. దీంతో పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ మాట్లాడంటే.. ఆ కామెంట్లు వైరల్ అవుతాయి. కానీ మహేశ్ విషయంలో మీడియా కామెంట్స్ ఎప్పుడూ లోతుగా, సబ్జెక్టు వైస్‌గా, పార్టీ లైన్‌ను అనుసరించి ఘాటు విమర్శలు చేసినట్టు ఎక్కడా లేదు. ఆయన గాంధీ భవన్‌లో పెట్టిన ప్రెస్‌మీట్లు కూడా చాలా పేలవంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ప్రెస్‌మీట్ పెడతాడో.. ఏం మాట్లాడుతాడో .. మీడియా పెద్దగా పట్టించుకోదు.. కాంగ్రెస్ సోషల్ మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయదు. అసలు ఆయన మీడయాను పట్టించుకుంటే కదా!