Government Apps: ఒకప్పుడు ఫోన్లు అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే వినియోగించారు. ప్రస్తుతం వస్తున్న అధునాతన స్మార్ట్ ఫోన్స్.. ప్రతీ ఒక్కరి జీవితాన్ని డిజిటల్ గా మార్చేశాయి. యూపీఐ ద్వారా ప్రతీ ఒక్కరూ ఆన్ లైన్ లోనే తమ పేమెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వ యాప్స్ ను ఉపయోగించి.. ఫోన్ లోనే అప్లికేషన్స్ పెట్టుకోవడం, సర్టిఫికేట్స్ పొందడం వంటివి కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందేందుకు ఫోన్ లో ఉండాల్సిన 5 కచ్చితమైన యాప్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లోనే మర్చిపోయామని చాలా మంది కంగారు పడే ఉంటారు. అయితే ఈ సమస్యకు డిజిలాకర్ యాప్ తో చెక్ పెట్టవచ్చు. కేంద్ర ఐటీ శాఖ తీసుకొచ్చిన ‘డిజిలాకర్’ మీ డాక్యుమెంట్లన్నింటినీ సురక్షితంగా దాచుకునే ఒక డిజిటల్ లాకర్ గా పనిచేస్తుంది. ఇందులో మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, వాహన రిజిస్ట్రేషన్ (RC), పదో తరగతి మార్కుల లిస్ట్ వంటి ఎన్నో సర్టిఫికెట్లను భద్రపరుచుకోవచ్చు. ఐటీ చట్టం ప్రకారం డిజిలాకర్‌లో ఉండే డిజిటల్ పత్రాలు అసలైన భౌతిక పత్రాలతో సమానంగా పరిగణిస్తారు. కాబట్టి పోలీసులు, ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడైనా వీటిని ధైర్యంగా చూపించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో ప్రైవేట్ పేమెంట్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోలిస్తే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్వయంగా రూపొందించిన ‘భీమ్’ యాప్ అత్యంత సురక్షితమైనదని చెప్పవచ్చు. దీనిని ఉపయోగించి.. మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ద్వారా క్షణాల్లో ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరో అకౌంట్‌కు డబ్బులు పంపుకోవచ్చు. కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లులు వంటి యూటిలిటీ పేమెంట్స్ సులువుగా చేయవచ్చు. ప్రైవేట్ యాప్‌ల లాగా ఇందులో థర్డ్ పార్టీ ప్రకటనల గోల లేకపోవడం విశేషం.
‘వన్ యాప్, వన్ ఇండియా’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ ‘ఉమాంగ్’ యాప్‌ను తీసుకొచ్చింది. వేర్వేరు ప్రభుత్వ సేవల కోసం వేర్వేరు యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవసరం లేకుండా ఇది ఒక ‘ఆల్ ఇన్ వన్’ వేదికగా నిలుస్తోంది. ఈ యాప్ ద్వారా పీఎఫ్ (EPFO) బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త పాన్ కార్డ్, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాదాపు 1000కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలు ఈ యాప్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉన్నాయి.
వాహనాలకు సంబంధించిన సేవల కోసం కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ను డిజైన్ చేసింది. ఈ యాప్ ను ఉపయోగించి.. వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇన్సూరెన్స్ గడువు, పొల్యూషన్ సర్టిఫికెట్ స్టేటస్ వంటివి తెలుసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వాహనం కొనేటప్పుడు ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడానికి, అలాగే వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది.
Also Read: ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్ హోమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!
ఉద్యోగులు, వ్యాపారులు.. నిత్యం విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే బోర్డింగ్ పాసులు, ఐడీ ప్రూఫ్ లను పట్టుకొని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం వారికి అతిపెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే దీనికి డిజి యాత్ర ద్వారా చెక్ పెట్టవచ్చు. ఈ యాప్ ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో చాలా వేగంగా పూర్తి కానుంది. ఎయిర్ పోర్టులో చాలా వరకూ సమయాన్ని ఈ యాప్ ఆదా చేయనుంది. పైన పేర్కొన్న ఈ 5 యాప్స్.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులో ఉండటం గమనార్హం.
Also Read: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!