Vi Family Plan: టెలికం రంగంలో సరికొత్త సంచలనానికి వొడాఫోన్ ఐడియా (Vi) తెరతీసింది. దేశంలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లకే పరిమితమైన ఫ్యామిలీ ప్లాన్ సౌకర్యాన్ని ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లకు కూడా అందించనున్నట్లు వీఐ ప్రకటించింది. ‘వీఐ పే సబ్ హై వీఐపీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచైనా ఈ ఫ్యామిలీ ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. మొబైల్ డేటాను సైతం పంచుకునే వెసులుబాటును ఇది కల్పిస్తోంది.
వీఐ యాప్ ద్వారా ప్రీపెయిడ్ యూజర్లు ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పుడు అనుకోకుండా ఇంటర్నెట్ అయిపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఇది నివారిస్తుంది. దేశంలో ఏ ప్రాంతంలో ఉంటున్నవారైనా ఈ గ్రూప్‌లో చేరవచ్చని వీఐ పేర్కొంది.
ఈ ఫ్యామిలీ ప్లాన్ కింద గరిష్టంగా నలుగురు సభ్యులు ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసుకోవచ్చని వీఐ తెలిపింది. ఇందులో ఒకరు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కాగా, మిగతా ముగ్గురు సెకండరీ యూజర్లుగా చేరవచ్చని చెప్పింది.
సాధారణ ఫ్యామిలీ ప్లాన్లలో ఒకే బిల్లు అందరికీ వర్తిస్తుంది. కానీ వీఐ ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ప్రత్యేకత ఏటంటే.. గ్రూప్‌లోని ప్రతి సభ్యుడు తమ సొంత ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని యథావిధిగా కొనసాగించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా వేరే ప్లాన్‌లోకి మారాల్సిన అవసరం లేదని వీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
గ్రూప్‌లో ఉన్న ఎవరికైనా అత్యవసరంగా హై-స్పీడ్ డేటా అవసరమైనప్పుడు ఇతర సభ్యులు తమ దగ్గరున్న డేటా నుంచి నేరుగా 500 MB వరకు బదిలీ చేయవచ్చు. దీనివల్ల ప్రతిసారీ చిన్నచిన్న రీఛార్జ్‌లు, యాడ్ ఆన్ డేటా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుందని వీఐ చెబుతోంది. ఈ డేటా ట్రాన్స్ఫర్లను దేశంలో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని స్పష్టం చేస్తోంది.
మరోవైపు ఫ్యామిలీ ప్లాన్ లో భాగస్వామ్యులు అయ్యే యూజర్లకు డిస్కౌంట్ ను సైతం వీఐ ఆఫర్ చేస్తోంది. డేటా షేరింగ్‌తో పాటు అధికారిక వీఐ యాప్ ద్వారా చేసే ప్రతి రీఛార్జ్‌పై గ్రూప్ సభ్యులు 10 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్‌ను పొందే వెసులుబాటును కల్పిస్తోంది. దీని ద్వారా యూజర్లు తమ డబ్బును ఆదా చేసుకోవచ్చని వీఐ పేర్కొంది.
వీఐ యాప్‌లో ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ముందుగా యాప్ డౌన్ లోడ్ చేసుకొని.. యాక్టివ్ ప్రీపెయిడ్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. తర్వాత యాప్‌లోని ఫ్యామిలీ ప్లాన్ సెక్షన్‌కు వెళ్లి ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌గా మారాలి. అక్కడ గరిష్టంగా ముగ్గురికి సంబంధించిన వీఐ ప్రీపెయిడ్ నంబర్లను రిక్వెస్ట్ పంపవచ్చు. మిగతా సభ్యులు ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. ఒక ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. తద్వారా అత్యవసర సమయాల్లో గ్రూప్ లోని సభ్యులకు 500MB వరకు డేటాను పంపవచ్చు. అలాగే రీఛార్జ్ డిస్కౌంట్లను సైతం పొందవచ్చు.
Also Read: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన
ఈ వీఐ ఫ్యామిలీ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను పొందే ముందు వినియోగదారులు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ ప్లాన్ కేవలం యాక్టివ్‌లో ఉన్న వీఐ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. పోస్ట్‌పెయిడ్ అకౌంట్లు దీనికి అనర్హులు. ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో గరిష్టంగా 4 మంది మాత్రమే (1 ప్రైమరీ + 3 సెకండరీ సభ్యులు) ఉండటానికి వీలవుతుంది. ఈ ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించిన అన్ని సేవలు అధికారిక వీఐ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Also Read: ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?