internet browsing security tips: నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో వెతకడం, అంతే కాకుండా రకరకాల వెబ్సైట్లు బ్రౌజ్ చేయడం రోజూ జరిగే పనే. అయితే, మనం ఏదైనా కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అదే కుకీస్ పర్మిషన్ పాప్-అప్! చాలా మంది చదవకుండానే ‘Accept All’ లేదా ‘Agree’ బటన్ నొక్కేస్తుంటారు. కానీ.. ఇలా గుడ్డిగా కుకీలపై క్లిక్ చేయడం వల్ల మీ ప్రైవసీకి పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుకీలు అనేవి మీరు విజిట్ చేసే వెబ్సైట్లు మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసే చిన్న టెక్స్ట్ ఫైల్స్. ఉదాహరణకు.. మీరు ఒక ఈ-కామర్స్ సైట్లో లాగిన్ అయి కార్ట్‌లో కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి క్లోజ్ చేస్తే.. తర్వాత మళ్లీ ఓపెన్ చేసినప్పుడు ఆ ఐటమ్స్ అలాగే కనిపిస్తాయి. దీనికి కారణం కుకీనే! సాధారణంగా.. యూజర్ అనుభవాన్ని మెరుగు పరచడానికి, పాస్వర్డ్లు గుర్తుంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, సమస్యంతా థర్డ్-పార్టీ కుకీల వల్ల వస్తుంది.
మీరు సైట్ ఓపెన్ చేయగానే వచ్చే అన్ని కుకీలను యాక్సెప్ట్ చేస్తే.. మీ ఆన్లైన్ సెర్చింగ్ పై పూర్తిగా ఇతరుల నిఘా ఉంటుంది. దీని వల్ల జరిగే నష్టాలు చాలానే ఉంటాయి.
ఆన్లైన్ ట్రాకింగ్, ప్రొఫైలింగ్: మీరు ఏ వెబ్సైట్లు చూస్తున్నారు, ఏ ప్రొడక్ట్స్ వెతుకుతున్నారు, ఏ రకమైన వార్తలు చదువుతున్నారు అనే పూర్తి డేటాను అడ్వర్టైజింగ్ కంపెనీలు సేకరిస్తాయి. దీని ఆధారంగా.. మీకోసం ప్రత్యేకమైన ప్రొఫైల్ తయారు చేసి, మీకు నచ్చని యాడ్స్ విసిగిస్తుంటాయి.
పర్సనల్ డేటాకు ముప్పు: కొన్ని హానికరమైన వెబ్సైట్లు ప్రమాదకరమైన కుకీల ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని, సెన్సిటివ్ డేటాను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.
ఆటోమేటిక్ లొకేషన్ ట్రాకింగ్: మీ లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి పర్సనల్ వివరాలు ఎప్పటికప్పుడు థర్డ్-పార్టీ యాప్‌లకు చేరిపోతాయి.దీని వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
డిజిటల్ ప్రపంచంలో.. మన పర్సనల్ విషయాలు కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. కుకీల విషయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు.
‘Accept All’ కు బదులుగా ‘Reject All’ లేదా ‘Manage’:
ఎప్పుడైనా వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అన్ని కుకీలను ఒకే సారి యాక్సెప్ట్ చేయెద్దు. ‘Cookie Settings’ లేదా ‘Manage Preferences’ లోకి వెళ్లి కేవలం బేసిక్ ఫంక్షనాలిటీకి అవసరమైన వాటిని మాత్రమే సెలక్ట్ చేసుకోండి. వీలైతే ‘Reject All’ క్లిక్ చేయడం మంచిది.
ప్రైవేట్ బ్రౌజింగ్:
సాధారణ బ్రౌజింగ్‌కు బదులుగా.. ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్ మోడ్‌ను వాడటం వల్ల సెషన్ ముగిసిన వెంటనే కుకీలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి.దీని వల్ల ట్రాకింగ్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
Also Read: 56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!
బ్రౌజర్ కుకీలను తరచుగా క్లీన్ చేయండి:
మీ బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచీ, కుకీలను డిలీట్ చేస్తూ ఉండండి. ఇది మీ డివైజ్‌ను స్పీడ్‌గా ఉంచడమే కాకుండా ట్రాకింగ్‌ను తగ్గిస్తుంది.
యాంటీ-ట్రాకింగ్ ఎక్స్టెన్షన్స్ :
ప్రైవసీ కాపాడే కొన్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ లేదా యాడ్-బ్లాకర్లను ఉపయోగించడం ద్వారా థర్డ్-పార్టీ కుకీలు మీ సిస్టమ్‌లోకి రాకుండా బ్లాక్ చేయెచ్చు.
మనం చేసే చిన్న అజాగ్రత్త పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ఇంటర్నెట్లో ప్రతీ క్లిక్ చాలా విలువైంది. కాబట్టి ఇకపై ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, కుకీల పాప్-అప్ కనిపించిన వెంటనే గుడ్డిగా ఓకే చెప్పకుండా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి.