iPhone Chat Backup: ఐఫోన్ ఉపయోగిస్తున్న వారిలో చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య స్టోరేజ్. ముఖ్యంగా వాట్సప్ డేటాను బ్యాకప్ చేసుకోవాలంటే iCloud మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఉచితంగా వచ్చే 5GB ఐక్లౌడ్ స్టోరేజ్ త్వరగానే నిండిపోవడంతో.. చాట్స్ సేవ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అయితే, ఈ సమస్యకు ముగింపు పలకడానికి మెటా వాట్సప్ ఒక సూపర్ ఫీచర్‌పై పనిచేస్తోంది.
త్వరలోనే ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌తో సంబంధం లేకుండా తమ వాట్సప్ చాటింగ్‌లను బ్యాకప్ చేసుకునే సౌకర్యం రానుంది. దీనికోసం మెటా సంస్థ సొంతంగా ఒక ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా యాపిల్ క్లౌడ్ సర్వీస్‌పై ఆధారపడే అవసరం యూజర్లకు తప్పుతుంది.
వాట్సప్ తీసుకొస్తున్న ఈ కొత్త విధానంలో యూజర్లకు సుమారు 2GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభించే అవకాశం ఉంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ డేటా ఉంటే.. భవిష్యత్తులో అదనపు ప్లాన్స్ కొనుగోలు చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారని సమాచారం.
Also Read: జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!
వాట్సప్ క్లౌడ్‌లో దాచుకునే ఈ చాట్ బ్యాకప్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది. అంటే.. మన మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు చాలా సురక్షితంగా ఉంటాయి. మనం తప్ప వేరెవరూ వాటిని యాక్సెస్ చేయడానికి వీలుండదు.
ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలోనే ఉందని WABetaInfo నివేదించింది. త్వరలోనే బీటా టెస్టింగ్ పూర్తయ్యాక.. ఐఫోన్ యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది. స్టోరేజ్ సమస్యలతో సతమతమయ్యే ఐఫోన్ ప్రియులకు ఇది ఖచ్చితంగా పెద్ద ఊరట నిచ్చే విషయమే.
Also Read: జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!