Xiaomi Power Bank 5i: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) సరికొత్త పవర్ బ్యాంక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ‘షావోమీ పవర్ బ్యాంక్ 5i’ పేరుతో ఈ నయా డివైజ్‌ను జూలై 23న భారత్ లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ సరికొత్త షావోమీ పవర్ బ్యాంక్ 5i.. ఏకంగా 20,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను దీని సాయంతో నాలుగైదు సార్లు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను దీని ద్వారా ఛార్జ్ చేసుకునే వెసులుబాటును షావోమి కల్పిస్తోంది. నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఈ పవర్ బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణ పవర్ బ్యాంకులు ఛార్జ్ అవ్వడానికి, ఇతర డివైజ్ వేగంగా ఛార్జ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. కానీ షావోమీ తన లేటెస్ట్ పవర్ బ్యాంక్ ను ఏకంగా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొస్తోంది. ఫలితంగా ఇతర టైప్-సి డివైజ్‌లను నిమిషాల వ్యవధిలోనే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో పవర్ బ్యాంక్ సైతం వేగంగా ఛార్జ్ అవుతుందని షావోమీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
చాలామంది ప్రయాణాల్లో పవర్ బ్యాంక్ తీసుకెళ్లినా.. దానికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ మరచిపోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ షావోమీ ఈ మోడల్‌లో ‘ఇన్‌బిల్ట్ కేబుల్’ (In-built Cable) సదుపాయాన్ని ఇచ్చింది. పవర్ బ్యాంక్‌తోనే జతచేసి ఉండే ఈ వైర్ వల్ల మళ్లీ అదనంగా కేబుల్స్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజైన్ పరంగా కూడా చాలా స్లిమ్‌గా ఈ పవర్ బ్యాంక్ ఉండటంతో.. ప్రయాణాల్లో తెలిగ్గా తీసుకెళ్లేందుకు వీలు కలుగనుంది.
అధిక సామర్థ్యం గల బ్యాటరీల విషయంలో భద్రతాపరమైన చర్యలు చాలా ముఖ్యమని చెబుతుంటారు. అందుకే పవర్ బ్యాంక్ 5iలో మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అదించింది. ఓవర్ ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్ వంటి సమస్యల నుండి మెుబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్ టాప్ లను కాపాడేలా ఇందులో సురక్షితమైన చిప్‌సెట్‌ను అమర్చినట్లు షావోమీ వర్గాలు తెలిపాయి.
Also Read: గ్రహాంతర వాసుల కోసం.. అంతరిక్షంలోకి భారతీయ పాట.. ఖగోళంలో మార్మోగుతున్న సింగర్ స్వరం!
షావోమీ ఈ పవర్ బ్యాంక్ ధరను అధికారికంగా ప్రకటించలేదు. జులై 23న లాంచ్ సందర్భంగా ధరను రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అదే రోజున పవర్ బ్యాంక్ కొనుగోలుపై ఆఫర్లు, సేల్ తేదీలను వెల్లడించే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షావోమి అధికారిక వెబ్ సైట్, అమెజాన్ లో ఈ పవర్ బ్యాంక్ సేల్లోకి వచ్చే అవకాశముంది. షావోమీ గత మోడల్.. కాంపాక్ట్ పవర్ బ్యాంక్ (20,000 mAh) ధరతో (రూ.1,799) పోలిస్తే.. లేటెస్ట్ మోడల్ ప్రైస్ రూ.500-1000 అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read: వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!