IND VS PAK Asia Cup 2026: ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Asia Cup 2026 ) భాగంగా ఇవాళ టీమిండియా మహిళల జట్టుతో పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ఉమెన్స్ టీమ్…సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయింది. ఇవాళ నామమాత్రంగా గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు తీవ్ర అడ్డంకి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆసియా కప్ మహిళల టోర్నమెంట్ 2026లో భాగంగా ఇవాళ టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ లివ్, సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్ లలో ఈ మ్యాచ్ తిలకించవచ్చు. అయితే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షురూ కానున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. టాస్ కంటే ముందే చిరు జల్లులు పడి… మ్యాచ్ ప్రారంభమైన తర్వాత భారీ వర్షం కురిసే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందట. దీంతో అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు.
దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఊరటను కలిగించనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇండియాపైన పాకిస్తాన్ ఇప్పటి వరకు టి20లలో ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచే అవకాశమే లేదని అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే… మ్యాచ్ రద్దయి పాకిస్తాన్ జట్టుకు అదనంగా ఒక పాయింట్ లభించి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి. అలా పాకిస్తాన్ జట్టుకు ఊరట లభిస్తుంది అని అంచనా వేస్తున్నారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంటులో ఇప్పటికే టీమిండియా నాలుగు పాయింట్లతో సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. అటు పాకిస్తాన్ రెండు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. మరో గ్రూపులో శ్రీలంక సెమీ ఫైనల్ కు క్వాలిఫై కాగా, బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అంటే టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీ ఫైనల్ స్థానాలను ఖరారు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.