Shubman Gill: సౌత్ ఆఫ్రికాతో జరగనున్న రెండవ టెస్టుకి ముందు టీం ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి టెస్ట్ రెండవ రోజు భారత కెప్టెన్ గిల్ మెడ నొప్పి కారణంగా మ్యాచ్ కి దూరమైన విషయం తెలిసిందే. అయితే మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్.. మరింత మెరుగైన వైద్యం కోసం నేడు ఉదయం ముంబైకి వెళ్ళాడు.
ముంబైలో స్పెషలిస్ట్ ని సంప్రదించి, గాయం పై పూర్తిస్థాయిలో చికిత్స తీసుకోబోతున్నాడు. ఇక గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రేపటినుండి గౌహతి వేదికగా ఈ రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది.
భారత జట్టు కూర్పుపై ఆసక్తి:
గిల్ గైర్హాజరిగితో భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తుది జట్టులో ఎక్కువమంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండడం జట్టుకు సమస్యగా మారింది. ఇప్పుడు గిల్ స్తానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవ్ దత్ పడిక్కల్ కూడా ఎడమ చేతివాటం ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ కి ఓపెనర్ గా అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే గిల్ ఆరోగ్యం పై రిస్క్ తీసుకోవడం లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. “అతడి దీర్ఘకాలిక ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం గిల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ మళ్ళీ నొప్పి తిరగబెట్టేదనే గ్యారెంటీ ఉంటేనే ఆడిస్తాం. మాకు బలమైన బెంచ్ ఉంది. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చారు.
భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోను గిల్ కీలక ఆటగాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా అరంగేట్రంలోనే ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టాడు ఈ పంజాబీ బ్యాటర్. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు. దీనికి ముందు ఆసియా కప్ 2025 సందర్భంగా టీమిండియా టి-20 జట్టులో పునరాగమనం చేశాడు.
Also Read: Smriti Mandhana wedding: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్.. ప్రధాని మోడీ సంచలన లేఖ
ఇలా టెస్ట్, వన్డే, టి-20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న నేపథ్యంలో.. స్వదేశంలో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లోని తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. మెడ నొప్పి కారణంగా ఐసియులో కూడా చికిత్స పొందిన గిల్.. ఇప్పుడు మరింత మెరుగైన వైద్యం కోసం ముంబై వెళ్ళాడు. అయితే అవిశ్రాంతంగా ఆడడం, నిద్రలేమి కారణాలవల్లే గిల్ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అలాంటిదేమీ లేదని బీసీసీఐ కొట్టిపారేసింది.