Yograj Singh : టీమిండియా మాజీ క్రికెటర్ యవరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh) గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తన కొడుకు క్రికెట్ కెరీర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒంటరి జీవితం నరకంగా ఉందని.. తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, చావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను ప్రేమించిన వారంతా దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేసాడు. తన జీవితంలో సాధించాల్సింది, అనుభవించేది ఏది లేదని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు యోగ్ రాజ్ సింగ్.
Also Read : Rohit Sharma: మరో 6 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ..వన్డే కెప్టెన్ గా ప్రమోషన్ ?
యోగ్ రాజ్ సింగ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రోజు సాయంత్రం ఇంట్లో నేను ఒంటరిగా కూర్చుంటాను. తిండి కోసం ఇతరులపై ఆధారపడుతున్నాను. ఆహారం కోసం నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఆహారం అందిస్తారు. నా వంటకోసం పని వారిని పెట్టుకున్నా. వారు వారి పని చేసుకొని వెళ్లిపోతారు. నాకు మనవళ్లతో సహా కుటుంబంలోని ప్రతీ ఒక్కరితో కలిసి ఉండాలని ఉంది. ఎందుకో తెలియదు. అందరూ నన్ను వదిలి దూరంగా ఉంటున్నారు. దీంతో జీవితం పై విరక్తి వస్తుంది. అందుకే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఎప్పుడూ కోరుకుంటే నన్ను తీసుకెళ్లవచ్చు” అని తెలిపాడు.
“యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నమ్ కౌర్ నన్ను విడిచి వెళ్లడం నా జీవితంలోనే పెద్ద షాక్. నా జీవితం ఎవరి కోసం అంకితం చేశానో.. ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను అందరినీ బాగా చూసుకున్నప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆ దేవుడిని అడిగాను. నేను కొన్ని తప్పులు చేసి ఉండచ్చు. కానీ ఎవరికీ కీడు మాత్రం చేయలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కానీ వృద్ధాప్యంలో నాకు ఎవరూ తోడుగా లేరు. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. ఇలా ఎందుకు చేశానా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నాకు ఇలా జరగాల్సిందేలే” అని యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh emotional statements)పేర్కొన్నాడు. షబ్నమ్ కౌర్( Shabnam Kaur)ను యోగ్ రాజ్ సింగ్ తొలి వివాహం చేసుకోగా.. వారికి యువరాజ్ సింగ్, జోరవర్ పుట్టారు. అయితే తరుచూ గొడవలు జరగడంతో ఈ ఇద్దరూ విడిపోయారు. యువరాజ్ సింగ్, అతడి తల్లి షబ్నమ్ కౌర్ ..యోగ్ రాజ్ కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత యోగ్ రాజ్ సింగ్ నీనా బంధెల్ అలియాస్ సత్బీర్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఏమైందో ఏమో తెలియదు.. కానీ వీరు కూడా యోగ్‌రాజ్ సింగ్‌తో కలిసి ఉండటం లేదు. వారు అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
Also Read : Sania Mirza: 210 కోట్ల దుబాయ్ విల్లా.. మాలిక్ పేరు తొలగింపు, కొడుకు కోసం సానియా సంచలన నిర్ణయం