Addanki Dayakar: ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, ఆయన పిచ్చి కూతలు కూస్తే మూతి పళ్లు రాలతాయని ఘాటుగా హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని, దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీతో కాంగ్రెస్ కలుస్తుందనడం కేటీఆర్ అజ్ఞానానికి పరాకాష్ట అని, అసలు ఆయన బుర్రలో గుజ్జు ఉందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత కడుపుమంట అని నిలదీశారు. తెలంగాణను పట్టి పీడిస్తున్న జలగలు కల్వకుంట్ల కుటుంబమేనని, ఆ కుటుంబం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీజేపీతో టచ్‌లో హరీష్ రావు
సొంత పార్టీలోనే కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ఆయన బావ హరీష్ రావు ఒప్పుకోవడం లేదనే నిజాన్ని అద్దంకి దయాకర్ బయటపెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కనీసం ఉండనిచ్చే పరిస్థితి కూడా లేదని, ఆయన ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. కవిత విషయమై మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు వద్దన్నందుకే ఆమెను పార్టీ నుంచి దూరం పెట్టారని, దీనిపై కేటీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ బంధాన్ని మళ్లీ బలపర్చడానికే హరీష్ రావు ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి అక్రమాల చిట్టా అంతా బీజేపీ దగ్గర ఉంది కాబట్టే, ఆ పార్టీ నేతలు బీజేపీపై మాట్లాడటానికి భయపడుతున్నారని స్పష్టం చేశారు.
మైనర్ బాలికతో నీచ రాజకీయాలా?
మైనర్ బాలికల అంశాన్ని రాజకీయం చేయడం అత్యంత నీచమన్న దయాకర్, అసలు ఆ బాలిక ఫోటోలను బయటపెట్టిన వెధవ ఎవరో చెప్పాలన్నారు. ఫ్యూచర్ సిటీపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు బెదిరించేలా ఉన్నాయని మండిపడ్డారు. భూదాన్, ముచ్చర్ల భూములను గతంలో ఎలా గుంజుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లు నిలకడ లేని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్ గురించి ప్రస్తావిస్తూ.. డీఎస్ కొడుకుగా పుట్టకపోతే అరవింద్‌కు అసలు రాజకీయ అడ్రస్సే ఉండేది కాదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఇస్తే, కల్వకుంట్ల కుటుంబం మాత్రం తామేదో తెలంగాణను కనిపెట్టినట్లు మాట్లాడుతోందని దుయ్యబట్టారు.
Also Read: బండి సంజయ్‌పై కేటీఆర్ కామెంట్స్.. ఆ పంచాయితీ లేదు, కాక్రోచ్ పార్టీ గురించి కూడా