CREDAI Hyderabad: హైటెక్స్ వేదికగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో (CREDAI Hyderabad Property Show) అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు (6, 7, 8వ తేదీల్లో) కొనసాగనున్న ఈ షోను.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Redd), సీఎస్ రామకృష్ణారావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన భట్టి.. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం గత 2 ఏళ్లలో రూ.2000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ కు ఇలాంటి షోలు అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అభిప్రాయపడ్డారు. ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ లో ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు.
నగరవాసుల సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఒక చక్కటి వేదికగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఉపయోగపడనుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొనుగోలు దారులకు, బిల్డర్లకు, బ్యాంకర్లకు మంచి ఫ్లాట్ ఫామ్ అని పేర్కొన్నారు. శుక్రవారమే (జనవరి 6వ తేదీ) ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో 7, 8 తేదీల్లోనూ కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. ఈ షోలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ చూసి.. నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఈసారి కస్టమర్ల కోసం ప్రత్యేకంగా బుక్ లెట్, యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రతీవారం ఇల్లు కోసం వెతికేబదులు.. ఒకరోజు ఫ్యామిలీ మెుత్తం ఈ షోకు రండి. అన్ని బ్రాండ్స్, ప్రాజెక్ట్స్ పరిశీలించండి. గత 25 ఏళ్లుగా క్రెడాయ్ నమ్మకమైన సంస్థగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రాపర్టీలో భాగమై నచ్చిన ప్రాజెక్టును ఎన్నుకోండి. హైదరాబాద్ లో సుస్థిర నివాసం ఏర్పరచుకోండి’ అంటూ జైదీప్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వందకుపైగా ప్రాజెక్ట్స్.. క్రెడాయ్ షోలో అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ క్రెడాయ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ జగన్నాథ్ రావు తెలిపారు. హైటెక్స్ లో జరుగుతున్న ఈ షో వద్దకు వచ్చి మీ అంచనాలు, అభిరుచులకు తగ్గట్లు ఉన్న ప్రాజెక్ట్ ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు బుక్ లెట్, యాప్ లో ప్రాజెక్ట్స్ కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలియజేశారు. విజిటర్ కు కావాల్సిన పూర్తి సమాచారాన్ని వాటి ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Also Read: BJP – Janasena Alliance: బీజేపీ-జనసేన పొత్తుకు బీటలు? వెనక్కితగ్గిన కమలం.. మున్సిపోరులో ఒంటరిగానే?
అటు క్రెడాయ్ షోలో పాల్గొనడం పట్ల ఆనందంగా ఉందని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తుండటం పట్ల బ్యాంకర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.