Harish Rao: విజయం, ధర్మ స్థాపనకు ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, ఎన్సాన్‌పల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రావణ దహన మహోత్సవంలో పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఎలక్ట్రిక్ రైలు.. కళ్లముందే నెరవేరిన దశాబ్దాల కల
ఒకప్పుడు గోడల రాతలు, ఎన్నికల నినాదాలకే పరిమితమైన రైలు, గోదావరి జలాలు, జిల్లా కలలను ప్రజల ఆశీస్సులతో నిజం చేసుకున్నామని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘సిద్దిపేట వాకిట్లోకి చుక్ చుక్ రైలు వచ్చింది. రూ. 400 కోట్లతో కరీంనగర్ వరకు ఎలక్ట్రిఫికేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాది, రెండేళ్లలోనే సిద్దిపేట నుంచి నేరుగా ఢిల్లీ, తిరుపతికి ఎలక్ట్రిక్ రైళ్లు పరుగులు తీస్తాయి’ అని పేర్కొన్నారు.
కాళేశ్వరం ఫలాలు.. రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట
రాష్ట్రమంతా కరువు చాయలు ఉన్నప్పటికీ, కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల పుణ్యమా అని సిద్దిపేటలో తాగు, సాగునీటికి కొరతే లేదన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి జలాశయాలతో సిద్దిపేట ‘రిజర్వాయర్ల ఖిల్లా’గా మారిందన్నారు. ఒకప్పుడు 50 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న వరి ధాన్యం దిగుబడి, నేడు ఏకంగా 5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరి సిద్దిపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిందని తెలిపారు.
పేద బిడ్డలకు డాక్టర్ విద్య.. నెక్స్ట్ టార్గెట్ యూనివర్సిటీ
మౌలిక వసతులతో పాటు సిద్దిపేటను విద్యా నిలయంగా తీర్చిదిద్దామని చెప్పారు. జిల్లాకో మెడికల్ కాలేజీ సంస్కరణతో కూలీల, టైలర్ల బిడ్డలు సైతం నేడు డాక్టర్లుగా ఎదుగుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, స్వచ్ఛ సిద్దిపేటగా రూపుదిద్దుకుందని వివరించారు. గోదావరి, రైలు, జిల్లా సాధ్యమైనట్లే, ప్రజల దీవెనలతో త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీని కూడా సాధించి తీరుతామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!