Shiva Shankar: నెల్లూరు నగర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమిగా కలిసి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల మధ్య, స్థానిక సర్దుబాట్లలో మాత్రం విభేదాలు పొడచూపుతున్నాయి. తాజాగా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని జనసేన పార్టీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పొత్తు కుదరకపోవడంతోనే నిర్ణయం
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుందని ఆ పార్టీ నేత, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ధర్మానికి విఘాతం కలగకుండా ఉండేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జనసేనకు తగిన ప్రాతినిధ్యం దక్కని చోట పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
కేవలం 3, 4 సీట్లే ఇస్తామనడం సరికాదు
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఐక్యంగా ముందుకు వెళ్తున్నప్పటికీ, నెల్లూరులో మాత్రం సీట్ల సర్దుబాటుపై సఖ్యత కుదరలేదని శివశంకర్ తెలిపారు. ఈ అంశంపై జిల్లా టీడీపీ అధ్యక్షులు, సంబంధిత మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో తాము చర్చలు జరిపినట్లు చెప్పారు. అయితే, తమకు కేవలం 3 లేదా 4 సీట్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
30 శాతం సీట్ల డిమాండ్
తమ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే, కూటమిలో జనసేనకు కనీసం 30 శాతం సీట్లు కేటాయించాలని తాము డిమాండ్ చేశామని శివశంకర్ గుర్తుచేశారు. కూటమి లక్ష్యాలు, దాని ప్రాముఖ్యతను స్థానిక నేతలకు వివరించినప్పటికీ స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రేపు అభ్యర్థులకు బి-ఫామ్స్ అందజేత
అనుకున్న విధంగా తగిన సీట్లు కేటాయించని చోట తాము స్వతంత్రంగా లేదా ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగానే బుధవారం అభ్యర్థులకు అధికారికంగా ‘బి-ఫామ్స్’ అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: సిద్దిపేట ప్రజలకు హరీశ్ రావు బిగ్ అప్‌డేట్.. త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్!