హైదరాబాద్ నగరవాసులకు భానుడి భగభగల నుండి కాస్త ఊరట లభించింది. గత వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరుణుడి పలకరింపుతో తడిసి ముద్దయ్యాయి.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న రాజధాని నగరంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ వంటి ప్రాంతాల్లో మొదటగా జల్లులు కురిశాయి. క్రమంగా వర్షం తీవ్రత పెరిగి జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, అమీర్‌పేట తదితర ప్రాంతాలను ముంచెత్తింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అకాల వర్షంతో ఉపశమనం పొందారు.
రహదారులు జలమయం..
భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షం..
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. జోన్ల వారీగా వాతావరణ విశ్లేషణ చేస్తే.. జోన్ 1 పరిధిలోకి వచ్చే యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పిడుగులు పడే ఛాన్స్..
వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. అకాల వర్షాల వల్ల ఎండ వేడిమి తగ్గినప్పటికీ.. కొన్ని చోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వాన తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు.
ALSO READ: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకున్న వాటర్ ట్యాంకర్!