Road Accident: హైదరాబాద్ నగరంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్12 వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఎదురుగా వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను సయ్యద్ హుస్సేన్, అక్షితగా పోలీసులు గుర్తించారు.
సయ్యద్ హుస్సేన్ సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ పూర్తయిన తర్వాత కుటుంబ పోషణ కోసం పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతున్నారు. ఈ క్రమంలో బుక్ చేసుకున్న ప్రయాణికురాలు అక్షితను గమ్యస్థానానికి తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!