Illegal Buildings: కోకాపేట్ లో ఆకాశాన్ని అందెలా నిర్మాణాలు…
– అంతా మనవాళ్లే అంటున్న అధికారులు…
– అక్రమ నిర్మాణాల వెనుక ప్రజా ప్రతినిధులు
– ప్రజా ప్రతినిధుల సహకారంతో అన్నీ తెలిసి అధికారుల మౌనం
– 250 గజాలలో సెల్లార్, 7 అంతస్తులు నిర్మిస్తున్నట్లు మండిపడుతున్నట్లు ప్రజలు
– ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని కోరుతున్న ప్రజలు
బ్యూరో స్వేచ్ఛ: అంతా మనవాళ్లే నిర్మాణాలు మనోళ్లే చేస్తున్నారు ఏం చేస్తాం.. చేసేది ఏమీ లేదు అనేలా నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ తయారయ్యింది. అక్రమ నిర్మాణాలకు అడ్డాగా నార్సింగి సర్కిల్ మారింది. నార్సింగి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తీసుకున్న అనుమతులు, చేపట్టే నిర్మాణాలను అరికట్టడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమను ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో మౌనం వహిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని కోకాపేట్‌లో ఇటివల 250 గజాలలో 7అంతస్తులు, 9 అంతస్తులు పైన పెంట్ హౌస్, దీంతో పాటు సెల్లార్‌లను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లేవు. అయితే చేపట్టిన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటి చర్యలేవీ అధికారులు తీసుకున్నట్లుగా కనిపించడం లేదు.
అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలం కావడమే కాకుండా స్థానిక నాయకులతో కుమ్మక్కై ముడపులకు లొంగిపోయి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులు త్వరగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అందులో భాగంగా వత్తాసు పలుకుతూ త్వరగా పనులు చేసుకునేలా నిర్మాణాల వద్ద బయట గోడలు కట్టేసి ముందుగా పెయింటింగ్ పూర్తి చేసుకోమని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది. పూర్తైన ఆ నిర్మాణాలను ఎవరూ కూల్చివేయరంటూ సలహాలు ఇస్తున్నారు. అంత వరకు వస్తే మేము ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు అంటూ తెలుపుతున్నట్లు అంతర్గత సమాచారం. నిర్మాణం ప్రారంభమై, పూర్తై గృహప్రవేశం అయ్యే వరకు దగ్గరుండి అన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: England vs Nepal: ఇంగ్లాండ్ కు ముచ్చెమటలు పట్టించిన నేపాల్…చివరి బంతికి సీన్ రివర్స్
మున్సిపాలిటీలో పరిధిలో ప్రజా ప్రతినిధులు సహకరిస్తున్నారనే సాకుతో అధికారులు అక్రమ నిర్మాణాలపై చేతులెత్తేశారా ? అనే సందేహాం కలుగక మానదు. అక్రమ నిర్మాణాలపై అవగాహన కల్గి ఉంటే ఉన్నతాధికారులకు వివరించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి వాటికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం ఏంటనే సందేహం కలుగుతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్వాకం వల్ల కోకాపేట్ లో అక్రమ నిర్మాణాలు మాత్రం విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయని, వాటికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని, లేకపోతే మున్సిపాలిటీలో మరిన్ని అక్రమ నిర్మాణాలను పెంచే అవకాశాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులే కల్పించినట్లు అవుతుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. 250 గజాలలో 7 అంతస్తులపై నిర్మాణాలు చేపట్టడం వల్ల ఏదైనా సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరూ వహిస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. జరగరాని ఘటన జరిగితే మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత వహిస్తారా అంటూ మండిపడుతున్నారు.
Also Read: Bandi Sanjay: ధనవంతులకు కాదు.. గుణవంతులకు ఓటు వేయండి: బండి సంజయ్