KTR Harish Rao Arrest:తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధు చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తున్నారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ నేతలు అలెర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు.
అయితే ఎర్రవల్లి వద్ద ఘర్షణ వాతావరణం ఉండటంతో శాంతి భద్రతల కారణంగా కేటీఆర్, హరీశ్‌రావులను మాత్రం హకీంపేట ప్రాంతంలో పోలీసులు నిలిపివేశారు.అసెంబ్లీ నుంచి బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం వద్ద ఆపేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం భారీ స్థాయిలోనే జరిగిందిముఖ్యంగా తమ నాయకుడికి ఏదైనా జరిగితే దానికి బాధ్యత సీయం రేవంత్ రెడ్డిదే అంటూ తేల్చి చెప్పారు కేటీఆర్. ఇక పోలీసుల పట్ల తమకి ఏ మాత్రం నమ్మకం లేదని, తమ నాయకుడిని తామే కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసులని భారీ సంఖ్యలో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రవల్లి వైపు రాజకీయ నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ కారణంగానే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అక్కడికి వెళ్ళకుండా ఆంక్షలు విధించారని తెలిపారు.అయితే పోలీసులు కేటీఆర్ ,హరీష్ రావు లని వెళ్ళకుండా వారి వాహనాలని అడ్డుకోవడంతో హకీంపేట వద్ద కొంతసేపు హైడ్రామా నడిచింది.
దీంతో పోలీసులు తమను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు వాహనాల్లో వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో నేతలు నడిచి అయినా ఎర్రవల్లి వెళతామంటూ నిర్ణయించారు.అందులో భాగంగా కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు బొల్లారం చౌరస్తా నుంచి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే అక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు బీఆర్ ఎస్ నేతలు. దీంతో పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు పోలీసులు చివరకు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు.
కేటీఆర్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. హరీశ్‌రావు సహా మరికొందరు ఎమ్మెల్యేలను జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయమంతా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టే తిరుగుతుంది.
ALSO READ:ఎర్రవెల్లి వైపు కాంగ్రెస్ శ్రేణులు.. కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్
ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం.. మరోవైపు బీఆర్‌ఎస్ నేతలని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకి తరలించడం ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఇంకెంత దూరం వెళ్ళనుందో !